end

జగన్‌పై అభిమానాన్ని చాటిన జేసీ

బొబ్బిలి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌పై విజయనగరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జె.వెంకటరావు తన భక్తిని చాటుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో శుక్రవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వెంకటరావు ముఖ్యమంత్రిని ఆకాశానికి ఎత్తేశారు. ఉన్నతాధికారిగా తన హోదా మరిచి పొగడ్తల జల్లు కురిపించారు. జగన్‌ హయాంలో పనిచేస్తున్నందుకు తన జన్మ ధన్యమైందన్నారు. ఇన్ని పథకాలను అమలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారని అందరూ చర్చించుకుంటున్నారని.. ఆదాయ వ్యయాలు గుమాస్తాలే చూస్తారని.. సీఎంకు అవసరం లేదని చెప్పారు. ఆయనకు తెగువే ముఖ్యమన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో వైసీపీ మేనిఫెస్టోను పెట్టడం సామాన్య విషయం కాదని.. 73 ఏళ్ల స్వాతంత్య్ర భారతావనిలో, తన 25 ఏళ్ల ప్రభుత్వ సర్వీసులో ఇలాంటి పరిపాలన చూడలేదని చెప్పారు. వలంటీర్లకు, కార్యదర్శులకు ఒకటో తారీఖున జీతాలిచ్చాకే తనలాంటి అధికారులకు జీతాలు ఇస్తున్నారని చెప్పారు. పెన్షనర్లకు తెల్లవారుజామున 4 గంటలకే వలంటీర్లు పెన్షన్‌ అందజేస్తున్నారని.. గతంలో కొండలు, గుట్టలు ఎక్కితే గాని నెట్‌ సిగ్నల్‌ ఉండేది కాదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇళ్ల స్థలాలు లాంటి పథకాలు పంపిణీ చేయాలంటే పార్టీ, కులం, ప్రాంతం వంటి వాటిని ప్రాతిపదికగా తీసుకోవలసి వచ్చేదని, కానీ, సీఎం జగన్‌ ఎలాంటి అభిప్రాయ బేధాలు, కుల-మతాలను పట్టించుకోకుండా అందిరికీ సమన్యాయం చేస్తున్నారన్నారు.

Exit mobile version