end

చరిత్ర సృష్టించిన కమలా హ్యారీస్‌

అమెరికా ఉపాధ్యక్ష పోరులో నెగ్గిన తొలి మహిళగా భారత మూలాలున్న కమలా హ్యారిస్‌(55) చరిత్ర సృష్టించారు. అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. 230 ఏళ్ల ఆ దేశ చరిత్రలో తొలిసారి ఓ మహిళ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతుండడం విశేషం. డెమొక్రటిక్ పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా గెలిచిన కమల జనవరి 20న అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌తో కలిసి ప్రమాణస్వీకారం చేయనున్నారు. నల్లజాతీయులకు, ఆసియా అమెరికన్లకు, ప్రత్యేకించి భారత సంతతి వారికి అగ్రరాజ్యంలో ఇంత పెద్ద అవకాశం లభించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి.

ఉపాధ్యక్షురాలిగా గెలిచిన కమలా… డెలావర్‌లో జరిగిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నా విజయం మహిళల విజయంగా భావిస్తున్నా. అమెరికా కార్యాలయంలో అడుగుపెట్టబోతున్న తొలి మహిళను నేనే.. కానీ చివరిదాని మాత్రం కాదన్నారు. నేనిప్పుడు సాధించిన ఈ విజయం.. తర్వాత వచ్చే మహిళా నేతలకు మార్గదర్శకం అవుతుందని కమలా ఆశాభావం వ్యక్తం చేశారు.

కమలా మూలాలు..
కమల తల్లి శ్యామలా గోపాలన్ స్వస్థలం చెన్నై. వివాహానికి ముందే ఆమె అమెరికా, కాలిఫోర్నియాలోని ఓక్లాండోలో స్థిరపడ్డారు. వృత్తిపరంగా డాక్టర్ అయిన జమైకాకు చెందిన హ్యారిస్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 1964 అక్టోబర్ 20వ తేదీన కమలా హ్యారిస్ జన్మించారు. ఇక న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన కమలా.. 2003లో శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా గెలిచారు. 2016లో నిర్వహించిన అమెరికా ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే ఆమె సెనెట్‌కు ఎంపిక కావడం విశేషం.

ఈసారి ఏకంగా అధ్యక్ష రేసులో దూసుకొచ్చారు. అయితే, నిధుల సమీకరణలో వెనుకబడి 2019, డిసెంబర్‌లో అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు. అనంతరం మూడు నెలల తర్వాత అనూహ్యంగా బైడెన్ నుంచి ఆమెకు పిలుపు రావడం.. ఉపాధ్యక్ష పదవికి పోటీపడి గెలవడం అంతా జరిగిపోయింది. దీంతో కమలా అగ్రరాజ్యం తొలి మహిళ ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. ఇక అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవడంపై భారత్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ కూడా ఆమెకు ట్విట్టర్ అభినందనలు తెలిపారు.

Exit mobile version