కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మనసులో మాటను బయటపెట్టేశారు. బీజేపీలో చేరికపై తన నిర్ణయాన్ని వెంకన్న సాక్షిగా వెల్లడించారు. రాబోయే రోజుల్లో బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనని చెప్పిన మొదటి వ్యక్తిని తానేనన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ బలపడుతుందని, కేసీఆర్ ఒంటెద్దు పోకడలు మానాలని హితవు పలికారు.
ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రతిపక్షాలను కలుపుకోవాలని సూచించారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని, ప్రజారంజక నిర్ణయాలు తీసుకోవాలన్నారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని తెలిపారు. పీసీసీ పదవి కోసం కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. పీసీసీ చీఫ్‌ను కాలమే నిర్ణయిస్తోందన్నారు. పార్టీలు వేరైనా అన్నదమ్ములంగా తామిద్దరం కలిసి ఉంటామన్నారు.