మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం తన రాజీనామా లేఖను శాసనసభాపతిని కలిసి ఇవ్వనున్నట్లు ఆయన ఆదివారం నాడు విలేకరుల సమావేశంలో తెలిపారు. గత కొన్ని రోజులుగా స్పీకర్ తనను కలిసే అవకాశం ఇవ్వడం లేదని ఆయన వాపోయారు. తన నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ఏ మాత్రం సహకరించలేదని, నిధులు ఇవ్వకపోవడంతో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వివరించారు. స్పీకర్‌ను కలిసే అవకాశం లేనందున నేరుగా అసెంబ్లీ కార్యదర్శితోపాటు కేంద్ర ఎన్నికల సంఘానికి తన రాజీనామా పత్రాన్ని పంపిస్తానని ఆయన పేర్కొన్నారు. చండూరు, చౌటుప్పల్ పురపాలికల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయని, అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. తన రాజీనామాతో ఉప ఎన్నిక వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు ఆయన వివరించారు.