end

కేటీఆర్‌ అభినవ అంబేడ్కరా..! సిగ్గు.. సిగ్గు

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌ను అభినవ అంబేడ్కర్‌ అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పోల్చడం సిగ్గు చేటని కాంగ్రెస్‌ ఎంపీ(మల్కాజిగిరి) రేవంత్‌రెడ్డి విమర్శించారు. గ్రేటర్‌ పరిధిలో వరద బాధితులకు సాయం అందించడంలో అక్రమాలు జరిగినా పట్టించుకోకుండా సొంత డబ్బా కొట్టుకోవడం టీఆర్‌ఎస్‌ నాయకులకు అలవాటైపోయిందని రేవంత్‌ ధ్వజమెత్తారు. అవినీతి అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉత్తర మండల కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. వరద బాధితులకు ఇచ్చిన సాయంపై అవకతవకలు జరిగాయని, వీటిపై వెంటనే విజిలెన్స్‌ విచారణ జరిపించాలని, అవినీతికి పాల్పడిన అధికారులపై కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

అధికారుల తీరును నిరసిస్తూ శుక్రవారం పార్టీ నేతలు నందికంటి శ్రీధర్‌, కూన శ్రీశైలంగౌడ్‌ తదితరులతో కలిసి సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ ఉత్తర మండల కార్యాలయం ఎదుట రేవంత్‌ రెడ్డి బైఠాయించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘తలసానికి సిగ్గు లేదు. అంబేడ్కర్‌, జ్యోతిరావు ఫూలేలతో కేటీఆర్‌ను పోల్చిన ఆయన బీసీల పక్షాన మాట్లాడుతుండడం సిగ్గు చేటన్నారు. తలసానిది ఎంత దిగజారుడు తనమంటే.. తన మనుమడికి కేటీఆర్‌ పేరు పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు.

వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 554 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం హర్షణీయమని రేవంత్‌ అన్నారు. కానీ, ఆ డబ్బులు నిజంగా నష్టపోయిన ప్రజలకు చెందకుండా గాడి తప్పాయని ఈ సందర్భంగా రేవంత్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ఎందుకో పేదలపై ప్రేమ కలిగిందని, కరడు కట్టిన రాక్షసుడికైనా మార్పు వస్తుందని అనుకున్నానని ఆయన చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు నిజమైన బాధితులకు కాకుండా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు, తమకు నచ్చిన వారికి అందాయని, అందులోనూ కమీషన్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు.

అక్రమాలపై తాము లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనిరేవంత్‌ ధ్వజమెత్తారు. ఆర్థిక సాయం దక్కిన లబ్ధిదారుల జాబితా ఇవ్వాలని తాము అడిగితే ఉత్తర మండల కమిషనర్ ‌శ్రీనివాస్‌ రెడ్డి మీనమేషాలు లెక్కిస్తున్నారని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేరని వారు అనుకుంటున్నారు. రేవంత్‌ ఉన్నాడని టీఆర్ఎస్‌ నాయకులు మరిచిపోయినట్టున్నారు. త్వరలోనే వారి తగిన బుద్ధిచెబుతామని ఆయన గులాబీ పార్టీని హెచ్చరించారు.

Exit mobile version