వ్యవసాయ భూమి గొడవలో ప్రత్యర్థులతో గ్రామ పెద్దలు కుమ్మక్కై తనకు అన్యాయం చేయడంతోపాటు కులబహిష్కరణ చేశారని నిజామాబాద్ రూల్ మండలం గుండారం గ్రామానికి చెందిన రెడ్డి సునీత తెలిపారు. అయితే ఆమె దీనికి సంబంధించి వినతి పత్రాలను జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆర్డీఓ, ఏసీపీలకు విడి విడిగా సమర్పించినట్లు వివరించారు. గ్రామంలో తన వ్యవసాయ భూమిని బావ మల్లారెడ్డి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.
ఇదేగాకుండా మండల సర్వేయర్‌తో సర్వే చేయించి హద్దుల ప్రకారం కంచె ఏర్పాటు చేసుకుంటే ప్రత్యర్థులు గొడవలకు దిగుతున్నారని సునీత విలపిచింది. ప్రత్యర్థులు ఈ భూమి విషయంలో గ్రామ పెద్దలను ఆశ్రయించి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని సునీత ఆరోపించారు. తమ పట్టాభూమిని ప్రత్యర్థి మల్లారెడ్డికి కట్టబెట్టాలని గ్రామ పెద్దలు చూస్తున్నట్లు వాపోయింది. అయితే దీనికి ఒప్పుకోకపోవడంతో కుల పెద్దలు తమ కుటుంబాన్ని బహిష్కరించారని, గ్రామంలో ఎవరైనా తమ కుటుంబ సభ్యులతో మాట్లాడితే రూ.5వేలు జరిమానా వేస్తామని కుల సంఘంలో తీర్మానం చేశారని ఆరోపించారు. అధికారులు తమకు న్యాయం చేయాలని, తమ భూమి సమస్యను పరిష్కరించాలని సునీత కోరుతున్నారు.