end
=
Wednesday, November 20, 2024
వార్తలురాష్ట్రీయంఏపీలో తూటాల్లా పేలుతున్న నేతల మాటలు
- Advertisment -

ఏపీలో తూటాల్లా పేలుతున్న నేతల మాటలు

- Advertisment -
- Advertisment -

  • శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
  • పదునెక్కుతున్న ఆంధ్రప్రదేశ్ నేతల వ్యూహాలు

ఆంధ్రప్రదేశ్ :
తెలుగు రాష్ట్రాల్లో (Politics) రాజకీయం రోజురోజుకు వెడెక్కుతోంది. ముఖ్యంగా ఏపిలో (AP)రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ కుతూహలంతో కూడిన ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీ (Assembly)ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం వరుస కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అదేసమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి (Godavari) జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan).. వచ్చే ఎన్నికల్లో సింగిల్ హ్యాండ్‌తో అధికారం చేపట్టే సత్తా వున్నా విపక్షాలను కలుపుకుని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చేసి.. వైసీపీని (YCP) గద్దె దింపుతానని హూంకరించారు. పవన్ కల్యాణ్ పర్యటన అలా ముగిసిందో లేదో ఇటు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (CHENDRABABU) రంగంలోకి దిగారు. ‘ఇదేం ఖర్మరా..’’ అంటూ తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ఎండగడుతూ జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. రోడ్ షోలలో చంద్రబాబు ప్రసంగాలు తన ఒరిజినల్ స్టైల్‌కి భిన్నంగా సాగుతుండడం విశేషం. ఇలాంటి ప్రభుత్వం అధికారంలో వుండడం రాష్ట్రం చేసుకున్న ఖర్మ అన్న సందేశాన్ని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా గత మూడున్నరేళ్ళలో చేపట్టిన కార్యక్రమాలను, ప్రకటించిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల పేరిట ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటి, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆర్‌కే రోజా (Roja) సెల్వమణి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కడ జరిగినా రోజా తనదైన శైలిలో పాల్గొంటున్నారు. విద్యార్థినులతో కలిసి స్టెప్పులేస్తూ వారిని ఉత్సాహపరుస్తున్నారు. తాజాగా రాజమహేంద్రవరంలోనూ (Rjamahendrabaram)ఆమె డ్యాన్స్‌ చేసి ప్రేక్షకులను ఉత్తేజ పరిచారు. శ్రీ వెంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో జగనన్న స్వర్ణోత్సవ సంబరాల (Jagananna Golden Jubilee Celebrations at Sri Venkateswara Anam Kalakendra)లో ఆమె పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి సంబరాలను ప్రారంభించారు. దీనిలో భాగంగా ఒక చిన్నారి జాన పద నృత్యానికి స్టెప్పులు వేస్తుండగా ఆ బాలికతో కలిసి రోజా ఇలా కాసేపు చిందులేశారు. పనిలో పనిగా విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. ఇలాంటి నేతలుండడం ఏపీ చేసుకున్న ఖర్మ అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు రోజా.

షెడ్యూలు ప్రకారమే జరిగితే 2024 ఏప్రిల్, మే (April, May) నెల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలొస్తాయి. ఓ ఆరు నెలల ముందు ఎన్నికల మూడ్ రావడం సహజంగా చూస్తుంటాం. కానీ ఏపీలో ఏడాదిన్నర ముందే ఆ వాతావరణం ఏర్పడుతోంది. ఓ వారం ప్రభుత్వ కార్యక్రమాల హడావిడి కనిపిస్తే.. రెండోవారం పవన్ కల్యాణ్, మూడో వారం చంద్రబాబు, నాలుగోవారం బీజేపీ ఇలా వరుస రాజకీయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరోవైపు జనం చెంతకు చేరేందుకు పాలక, ప్రతిపక్షాలకు చెందిన నేతలు తమకు తోచిన మార్గంలో ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. దాదాపు 400 రోజుల పాటు ప్రజల్లో తిరిగేందుకు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ సిద్దమవుతున్నారు. జనవరి 2023 నుంచి సుమారు 400 రోజుల పాటు పాదయాత్ర చేయబోతున్నట్లు లోకేశ్ (Lokesh) ప్రకటించారు. మేరకు లోకేశ్ పార్టీ వర్గాలతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో బాగా సర్కులేట్ అయ్యింది. తన తండ్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. దాదాపు అన్ని జిల్లాలు (కొత్త జిల్లాలు) కలిసేలా పాదయాత్ర రూట్‌ని లోకేశ్ టీమ్ ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం (Srikakulam District Ichhapuram) దాకా లోకేశ్ పాదయాత్ర కొనసాగబోతోంది. ప్రతీరోజూ 20 నుంచి 30 కిలోమీటర్ల మేరకు నడిచేలా లోకేశ్ పర్యటన ఖరారవనున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర అమరావతి (Amaravathiఏరియా గుండా కొనసాగే తరుణంలో ఆ ప్రాంతం నుంచి రాజధాని తరలించే వైఎస్ జగన్ ప్రభుత్వ యత్నాలను ఎండగట్టేలా, ముఖ్యంగా మంగళగిరిలో (mangalagiri)తన ప్రాబల్యం పెంచుకునేలా లోకేశ్ కార్యాచరణ రూపొందించుకుంటున్నట్లు సమాచారం.

ఇక ఓవైపు తాను నటిస్తున్న సినిమాలు పూర్తి చేస్తూనే ఇంకోవైపు రాష్ట్రంలో పర్యటనలు కొనసాగిస్తున్నారు పవన్ కల్యాణ్. ఇటీవల గుంటూరు జిల్లా ఇప్పటం (Guntur district Ippatam) రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన బాధితుల పరామర్శకు వెళ్ళిన పవన్ కల్యాణ్.. తన వాహన శ్రేణిని అనుమతించకపోవడంతో తన సోదరుడు చిరంజీవి గాడ్ ఫాదర్ (god father) సినిమాలో చేసిన విధంగా దాదాపు మూడు కిలో మీటర్లు నడిచి మరీ బాధితుల దగ్గరికి వెళ్ళారు. ఈ కార్యక్రమంతో పొలిటికల్ మైలేజీ రావడంతో దానికి కొనసాగింపుగా మరోసారి ఇప్పటం వెళ్ళారు పవన్ కల్యాణ్. ఇప్పటం బాధితులకు తనవంతు సాయంగా ఒక్కో కుటుంబానికి మూడు లక్షల రూపాయలను పంపిణీ చేశారు. ఇంకోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ‘ఏం ఖర్మరా’ అంటూ జనం మధ్యకు చొచ్చుకు వెళుతున్నారు. అయితే చంద్రబాబు ప్రస్తావిస్తున్న ఓ అంశం అందరినీ ఆలోచింప జేస్తోంది. మరోసారి ఓటమి పాలైతే 2024 ఎన్నికలే తనకు ఆఖరి ఎన్నికలు కావచ్చంటూ ఆయన చేస్తున్న ప్రకటన పలు రకాల ఇంటర్‌ప్రిటేషన్లకు (interpretations) అవకాశం ఇస్తోంది. చంద్రబాబు ప్రకటన తన వయస్సును దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారా లేక దాని వెనుక సెంటిమెంటు రగిలించే వ్యూహమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు వయస్సు 72 ఏళ్ళు. 2024 ఎన్నికల నాటికి ఆయన వయస్సు 74 ఏళ్ళకు చేరుతుంది. చిన్నా చితక ఆరోగ్య సమస్యలు, పెద్దగా దురలవాట్లు లేని చంద్రబాబు ఇప్పటికీ యాక్టివ్‌గానే వున్నారు. కానీ 2024లో ఓటమి పాలైతే ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన వయస్సు 79 ఏళ్ళకు చేరుతుంది. సో.. ఆ వయస్సులో యాక్టివ్ పాలిటిక్స్ (Active Politics) చేయడం ఒకింత కష్టమే. దానిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు 2024లో ఓటమి పాలైతే తనకవే ఆఖరు ఎన్నికలన్న సెంటిమెంటును రగిలిస్తున్నారని పలువురు భావిస్తున్నారు.

2019లో విజయం సాధించిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. టీడీపీని నిర్వీర్యం చేసే వ్యూహాలు అమలు చేశారు. అదే క్రమంలో మరోసారి టీడీపీ ఓడిపోయి, పదేళ్ళపాటు జగన్ సీఎంగా వుంటే.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్థంలో పడే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు లెగసీని ఆయన తనయుడు లోకేశ్ చేజిక్కించుకోకపోతే ఆ పరిస్థితి జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా పరిణమించే ఛాన్సెస్ బలంగా వున్నాయి. ఇది అంచనా వేయడం వల్లనే తన వ్యక్తిగత ఇమేజీ (image) పెంచుకోవడంతోపాటు పార్టీ శ్రేణులకు చంద్రబాబు తర్వాత తాను బలమైన నేతగా ఎదుగుతానన్న భరోసా ఇచ్చేందుకే లోకేశ్ 400 రోజుల పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు. 2024లో జగన్‌ను గద్దె దింపేందుకు చంద్రబాబు సర్వ శక్తులు ఒడ్డడం ఖాయమని ఆయన ప్రకటనలే చాటుతున్నాయి. టీడీపీ సింగిల్‌గా వైసీపీని ఓడించే సత్తా లేదని భావిస్తే విపక్షాల ఓట్లు చీలకుండా వుండేందుకు పవన్ కల్యాణ్‌తో జత కట్టే దిశగానూ చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. అందుకే విశాఖపట్నం (Visakhapatnam) ఉద్రిక్తత తర్వాత విజయవాడ చేరుకున్న పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు అనూహ్యంగా కలిశారు. సంఘీభావం ప్రకటించారు. ప్రత్యర్థికి ప్రత్యర్థి తనకు సన్నిహితుడన్న ధోరణిలో చంద్రబాబు ముందుకు వెళుతున్నారు. అదేసమయంలో 2019లో విభేదించిన బీజేపీ నేతలను సైతం చంద్రబాబు కలుస్తున్నారు. ఆగస్టు నెలలో ఢిల్లీ (Dellhi) వెళ్ళిన చంద్రబాబు మొహమాటం లేకుండా ప్రధాని మోదీతో కాసేపు మాట్లాడారు. ఇద్దరు పక్కకు వెళ్ళి మరీ ముచ్చటించుకున్నారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ (NITI Aayog Governing Council meeting)లో పాల్గొనేందుకు చంద్రబాబు వెళ్ళినపుడు ఈ పరిణామం చోటుచేసుకుంది. న్యూఢిల్లీలో డిసెంబర్ 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన జరిగే జీ20 సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఆహ్వానం అందింది. ఇందులో భాగంగా తెలుగుదేశం, వైఎస్సార్సీపీ అధినేతలైన చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ ఇద్దరినీ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi) స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్‌ (Rashtrapati Bhavan)లో జరిగే ఈ కార్యక్రమంలో ఈ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు ఒకే వేదిక పంచుకోబోతున్నారు. ఏపీలో రాజకీయం వేడెక్కుతున్న తరుణంలో ఇద్దరూ కలిసి ప్రధాని అధ్యక్షతన జరగనున్న కార్యక్రమంలో ఒకే వేదిక పంచుకోనుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ఆసక్తి మాట కాస్త పక్కన పెడితే ఏడాది పాటు జీ20 గ్రూపునకు సారథ్యం వహిస్తున్న తరుణంలో ఏడాది కాలంపాటు పలు కార్యక్రమాల నిర్వహణకు నరేంద్ర మోదీ సర్కార్ సిద్దమవుతోంది. దీనిపై చర్చించేందుకు దేశంలో గుర్తింపు పొందిన పార్టీల అధ్యక్షుల అభిప్రాయాలను తీసుకోవాలని మోదీ భావించారు. అందుకే డిసెంబర్ 5 భేటీని ఏర్పాటు చేశారు. అయితే, ఈ భేటీలో ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు పాల్గొంటారు. దీనిని ఏపీలో రాజకీయ పార్టీల పునరేకీకరణకు చంద్రబాబు వినియోగించుకునే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ముఖ్యంగా బీజేపీకి దగ్గరయ్యేందుకు, ఏపీలో మూడు పార్టీల కూటమి రూపొందించేందుకు చంద్రబాబు ప్రాధాన్యతనివ్వ వచ్చని, ఆ దిశగా బీజేపీ (BJP) నేతలతో సమాలోచనలు జరపవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5 భేటీ ఓ రకంగా ఏపీ పాలిటిక్స్‌లో గేమ్ ఛేంజర్ (game changer in AP Politics) కావచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఏడాదిన్నర కాలంలో ఎలాంటి మార్పులు జరిగి, 2024లో ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది ఆసక్తి రేపుతోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -