న్యూఢిల్లీ: టెస్లా ఇంక్ చీఫ్, బిలియనీర్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను గ్రహించే ఉత్తమ సాంకేతికత అభివృద్ధి కోసం 100 మిలియన్ డాలర్లు విరాళంగా ఇవ్వనున్నట్టు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. వాతావరణ మార్పులను అదుపులో ఉంచే అనేక ప్రణాళికలలో భూగ్రహం వేడెక్కే ఉద్గారాలను సంగ్రహించడం చాలా కీలకం కానుంది. అయితే, ఈ విషయంలో ఇప్పటి వరకు ఉన్న సాంకేతికత పురోగతి చాలా తక్కువ. గాలి నుంచి కార్బన్‌ను బయటకు తీయడం కంటే ఉద్గారాలను తగ్గించడంపైనే ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు.
దేశాలు జీరో ఉద్గార లక్ష్యాలను చేరుకోవాలంటే కార్బన్‌ను సంగ్రహించే సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించడంలో కొంత పెరుగుదల అవసరమని గతేడాది అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొంది. ‘అత్యుత్తమ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ అభివృద్ధి కోసం 100 మిలియన్ డాలర్లు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నా’ అని ట్వీట్ చేసిన మస్క్.. మరో ట్వీట్‌లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వచ్చే వారం తెలియజేస్తానని పేర్కొన్నాడు. ఇంతకుమించిన వివరాలను వెల్లడించేందుకు టెస్లా అధికారులు నిరాకరించారు.