అంగారక గ్రహ రహస్యాలు ఛేదించేందుకు ఇస్రో సిద్ధం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (Isro) మంగళ్‌యాన్ ప్రయోగం కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నవరత్న కాన్ఫరెన్స్ సమావేశంలో ఇస్రో చీఫ్ వి. నారాయణన్ మంగళ్‌యాన్(Mangalyan) సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడించారు. మొదట ఎల్‌వీఎం3 రాకెట్‌లో 4500 కిలోల అంతరిక్ష నౌక(Space ship)ను ఉంచి దానిని 190x 35,786 కిమీ భూకక్ష్యలో నిర్దేశించి ఉంచుతారు. అక్కడి నుంచి క్రూయిజ్ స్టేజీ, డీసెంట్ స్టేజీ మిశ్రమమైన కాంపోజిట్ మాడ్యూల్‌లో అడుగుపెట్టనున్న అంతరిక్ష నౌక కొన్ని నెలల పాటు అంగారక గ్రహానికి ప్రయాణం కొనసాగించనుంది. కాగా క్రూయిజ్ స్టేజీ అంతరిక్ష నౌకను భూకక్ష్య నుంచి అంగారక గ్రహం చుట్టూ ఉన్న సంగ్రహ కక్ష్య(Orbitol)లోకి తీసుకెళ్లడానికి ప్రొపల్టన్ సిస్టమ్‌గా పనిచేయనుంది. మంగళ్‌యాన్ అంగారక గ్రహ సమీపంలోకి ప్రవేశించిన తర్వాత డీసెంట్ స్టేజీ క్రూయిజ్ స్టేజీ నుంచి విడిపోనుంది. ఆ తర్వాత నేరుగా అంగారక గ్రహ వాతావరణంలోకి ప్రవేశించనుంది. అనంతరం అధిక వేగాన్ని నియంత్రించడం కోసం ఏరోబ్రేకింగ్ తన పనిని ప్రారంభించనుంది. అందుకు అంగారక గ్రహంపై ఉన్న వాతావరణాన్ని ఉపయోగించుకోనుంది. అంగారకుడిపై మంగళ్‌యాన్ సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు రాకెట్‌లో ఏర్పాటు చేసిన ఉష్ణ రక్షిత ఏరోసెల్‌ను, సూపర్సోనిక్ పారాచూట్‌లు యాక్టివ్ కానున్నాయి. డిసెంట్ స్టేజీ అంగారక గ్రహం ఉపరితలం నుంచి దాదాపు 1.3 కిమీ ఎత్తులో ఉన్నప్పుడు ల్యాండింగ్ చివరి దశ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ల్యాండర్ దాని ఆన్‌బోర్డ్ ఇంజిన్ల సాయంతో డీసెంట్ స్టేజీని నియంత్రిస్తూ అంగారకుడిపై సురక్షితంగా ల్యాండ్ కానుంది. మంగళ్‌యాన్ ప్రయోగం విజయవంతమైతే ఇప్పటికే అంగారక గ్రహంపై అడుగుపెట్టిన దేశాల సరసన భారత్ చేరనుంది. అయితే మంగళ్‌యాన్ ప్రయోగంపై ఇస్రో అధికారిక తేదీని వెల్లడించాల్సి ఉంది.