కొద్ది రోజులుగా రికార్డుల సాధనే లక్ష్యంగా సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లకు చెక్ పడింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 353 పాయింట్లు పతనమై 45,751కు చేరింది. నిఫ్టీ సైతం 116 పాయింట్లు కోల్పోయి 13,413 వద్ద ట్రేడవుతోంది. సహాయక ప్యాకేజీపై విభేదాలు, టెక్ దిగ్గజాలలో అమ్మకాల కారణంగా బుధవారం యూఎస్ మార్కెట్లు 0.4-2 శాతం మధ్య క్షీణించాయి. దీనికితోడు ఇటీవల వేగంగా దూసుకెళుతున్న దేశీ మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు వెనకడుగు వేస్తున్నట్లు నిపుణులు వివరించారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,743 వద్ద, నిఫ్టీ 13,412 వద్ద కనిష్టాలకు చేరాయి.
యూపీఎల్ పతనం
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బలహీనపడ్డాయి. ప్రధానంగా మీడియా పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ, మెటల్ 2.6-1.2 శాతం మధ్య డీలా పడ్డాయి. ఫార్మా స్వల్పంగా 0.2 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్ 10.5 శాతం కుప్పకూలగా.. టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐవోసీ, అల్ట్రాటెక్, గెయిల్, ఓఎన్జీసీ, ఇండస్‌ఇండ్, బీపీసీఎల్, ఎంఅండ్‌ఎం 2.5-1.3 శాతం మధ్య క్షీణించాయి. బ్లూచిప్స్‌లో కేవలం మారుతీ, నెస్లే, టైటన్, దివీస్ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.5-0.3 శాతం మధ్య లాభపడ్డాయి. (వ్యాక్సిన్ షాక్- పసిడి ధరల పతనం)
పీఎస్‌యూ షేర్లు వీక్
డెరివేటివ్స్‌లో ఆర్‌ఈసీ, పీఎప్‌సీ, బీహెచ్‌ఈఎల్, కెనరా బ్యాంక్, రామ్‌కో సిమెంట్, బీఈఎల్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, జీ, శ్రీరామ్ ట్రాన్స్ 7-3 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క నౌకరీ, బాలకృష్ణ, డాబర్, బంధన్ బ్యాంక్, అరబిందో, పిడిలైట్, జూబిలెంట్ ఫుడ్, టొరంట్ ఫార్మా 2.4-0.3 శాతం మధ్య బలపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.5 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,548 క్షీణించగా.. 662 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి.
ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,564 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,493 కోట్ల విలువైన అమ్మకాలు నిర్వహించాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2,910 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,641 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.