- ఆయా పార్టీల్లో గుబులు
జీహెచ్‌ఎంసీలో ఓటరు తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఓట్ల లెక్కింపు జరిగే శుక్రవారం దాకా పార్టీలు, అభ్యర్థుల్లో ఉత్కంఠ తప్పదు. అయితే పోలింగ్ శాతం తక్కువగా నమోదవడం వారిని మరింత టెన్షన్ పెడుతోంది. ఎన్నికల్లో సగటు ఓటింగ్ 40-45శాతంగా చెబుతున్నారు. దీంతో తక్కువ పోలింగ్ ఎవరికి కలిసి వస్తుంది? ఎవరికి మేలు? అని లెక్కలు వేసుకుంటున్నారు. అభ్యర్థులే కాకుండా రాజకీయ విశ్లేషకులూ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటేనే పోలింగ్ శాతం పెరుగుతుందని వారంటున్నారు.
అదే సమయంలో ఈసారి ఓటర్ నాడి పట్టుకోవడం అంత సులువుగా లేదని, పరిస్థితులు కొంత భిన్నంగానే ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. పోలింగ్ శాతం తక్కువగా నమోదవడం తమకు కలిసి వస్తుందని అధికార పక్షం అంచనా వేస్తోంది. వరద సాయంగా రూ.10 వేల వరద సాయం తీసుకున్న కుటుంబాల్లో మెజారిటీ ఓట్లు.. కారు గుర్తుకే పడ్డాయని, సాయం అందని వారు కూడా 7వ తేదీ నుంచి ఇస్తామన్న సీఎం ప్రకటనతో తమ పార్టీ వైపు మొగ్గుచూపారని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు.
ఇక క్షేత్రస్థాయిలో పరిస్థితుల ఆధారంగా తమ విజయం ఖాయమని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. నాంపల్లిలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకొన్నారు. రూ.10వేల వరద సాయం అందని ప్రజలు పెద్ద సంఖ్యల్లో పోలింగ్ బూత్‌లకు వచ్చారని చెబుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్, ఆరేళ్లలో ప్రభుత్వం ఏం చేయలేదన్న వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని, ఇవే తమ గెలుపునకు బాటలు వేస్తాయని కమలం నేతలు అంటున్నారు. ఊహించిన దాని కంటే తమకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం పోలింగ్ రోజున కనపడిందని కాంగ్రెస్‌నేతలు చెబుతున్నారు. తమ గెలుపు జాబితాలో లేని డివిజన్లలో కూడా పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారని పేర్కొంటున్నారు. పాతబస్తీలో తమ పట్టు ఏ మాత్రం తగ్గదని, పోలింగ్ తక్కువగా నమోదైనా గతం కంటే సీట్లు మాత్రం పెరుగుతాయని మజ్లిస్ నాయకులు చెబుతున్నారు.