ఏఐఎంఐఎం పార్టీ దేశంలో క్రమంగా తమ ఉనికిని చాటుకుంటోంది. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ప్రారంభమైన ఎంఐఎం ప్రస్థానం.. క్రమంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు విస్తరిస్తోంది. అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వ బలం ఇందుకు అదనపు అంగు అని చెప్పవచ్చు. కాగా, వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తాము పోటి చేసే అవకాశం లేకపోలేదని ఇటీవల అసదుద్దీన్ ప్రకటించారు. బెంగాల్‌లోని ఎంఐఎం నాయకులతో చర్చిస్తామని, వారి కోరిక మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. కాగా, ఇటీవల బిహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఏకంగా 5 స్థానాలను సాధించి.. రాజకీయ పార్టీలను ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం నేతలు బిజీగా ఉన్నారు. క్రితం సారి 40కి పైగా డివిజన్లను సొంతం చేసుకున్న ఆ పార్టీ.. ఈ సారి మరిన్ని స్థానాలను గెలుచుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆ పార్టీకి అధికార టీఆర్‌ఎస్ మిత్ర పక్షమన్న విషయం తెలిసిందే. కానీ, తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఇరుపార్టీలు ఇప్పటికే స్పష్టం చేశాయి.