విలక్షణ నటుడు, టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్‌బాబు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి నిన్నటితో 45 ఏళ్లు పూర్తయింది. ఈ 45 ఏళ్ల సినీ కేరీర్‌లో ఆయన ఎన్నో విజయాలు, అపజయాలు చవిచూశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తన అభిమానులు ఆయనను డైలాగ్‌కింగ్‌గా పిలుచుకుంటే.. ఇండస్ట్రీ మాత్రం కలెక్షన్ కింగ్ అని గుర్తింపునిచ్చింది. 1975లో తన గురువుగారు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన స్వర్గం నరకం సినిమాతో ఆయన తెరంగ్రేట్రం చేశారు. కాగా, మోహన్‌బాబు ఇప్పటివరకు 565 సినిమాల్లో నటించారు. మొదట హీరోగా, తర్వాత విలన్‌గా.. మళ్లీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయారు.
మెగాస్టార్ చిరంజీవి, మోహన్‌బాబు కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వీరు సినిమాల్లో పోరాట సన్నివేశాల్లో నటిస్తుంటే.. జనాలు మాత్రం వీరు నిజంగానే శత్రువులు అనుకునేవారు. అలా ఉండేది వీరి నటన. పెదరాయుడు, అసెంబ్లీరౌడీ, కలెక్టర్ గారూ తదుపరి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. శ్రీ లక్ష్మీ ప్రసన్న బ్యానర్‌పై ఎన్నో చిత్రాలు నిర్మించారు. ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈ లెజెండరీ ఆర్టిస్ట్.. మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుందాం.