హైదరాబాద్‌ను బయోటెక్ కేంద్రంగా మలచాలని మూడు దశాబ్దాల కిందట జెనోమ్ వ్యాలీకి అంకురార్పణ చేశా. నా విజన్ నిజమైనందుకు గర్వంగా ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రధాని స్వయంగా వచ్చి భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఏ దశలో ఉందో సమీక్షించడం ఆనందించే విషయం అన్నారు. ‘‘మన దేశంలో బయోటెక్ అనే పదం కొత్తగా వినిపిస్తున్న రోజుల్లో నేను హైదరాబాద్‌లో జెనోమ్ వ్యాలీకి అంకురార్పణ చేశాను. దానిని బయోటెక్ రంగానికి ఒక కేంద్ర స్థానంగా మలచాలని ప్రయత్నించాను. ఇప్పుడు అందులో 150కి పైగా ప్రపంచ ప్రఖ్యాత లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఆర్‌అండ్ డీ విభాగాలు నిర్వహిస్తున్నాయి.
దీనితో జెనోమ్ వ్యాలీ బయోటెక్ హబ్‌గా మారింది. భారత్ బయోటెక్ కంపెనీకి ఆర్‌అండ్‌డీ కేంద్రం కూడా అక్కడే ఉంది. అందులోనే కరోనా వ్యాక్సిన్ తయారీ పరిశోధనలు సాగుతున్నాయి. దూరదృష్టితో చేసే పనులు భావి తరాలకు ఎలా ఉపయోగపడతాయో జెనోమ్ వ్యాలీ నిదర్శనమని ఆయన తెలిపారు.