మేనమామ వెంకటేశ్, బావ రానాల బాట లో నాగచైతన్య కూడా ఓటీటీకి రెడీ అన్నారు. ‘దూత’ అనే వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీకి ఎంట్రీ ఇస్తున్నారు చైతూ. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది.
అక్కినేని నాగచైతన్య కు హారర్ సినిమాలు చూడటం అంటే చాలా భయం. దెయ్యాలు, ఆత్మలు, భూతాలు నేపథ్యంలో తెరకెక్కే సినిమాలు చూడరు. హారర్స్కు దూరం! చిత్రం ఏంటంటే ఆయన ఇప్పుడు ఓ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో డిజిటల్ తెర మీదకు ఎంట్రీ ఇస్తున్నారు. దీనికి విక్రమ్ కె. కుమార్ దర్శకుడు. ఈ వెబ్ సిరీస్‌కు ‘దూత’ టైటిల్ ఖరారు చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం దూత చేస్తున్నారు. ఇందులో నాగ చైతన్య జర్నలిస్ట్ అనే కీలకపాత్ర చేస్తున్నారని తెలిసింది. ఆయనకు జోడిగా ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ తెలుగు డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో విక్రమ్ కె. కుమార్ మంచి స్క్రిప్ట్ రెడీ చేశారట. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉండే విధంగా 24 నుంచి 30 ఎపిసోడ్స్ తీసేలా పెద్ద స్కెచ్ వేశారట. మొత్తం మూడు సీజన్స్ గా విడుదల చేయాలని ప్లాన్ చేశారట. ఒక్కో సీజన్ లో 8 లేదా 10 ఎపిసోడ్స్ ఉంటాయట.
ఈ సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. అయితే అక్కినేని కుటుంబంతో ‘మనం’లాంటి మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె. కుమార్ ‘దూత’లో నాగచైతన్యను డిఫరెంట్ లుక్‌లో చూపించనున్నారు. ఇక ఆయన దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ ఈ నెల 22న విడుదల కానుంది.