కోవిద్19 కారణంగా ఆటగాళ్ల, అభిమానుల శ్రేయస్సు కొరకు ఈ ఏడాది ఐపీఎల్ ను యూఏఈలో నిర్వహించామన్నారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. కానీ, వచ్చే సీజన్‌ను మాత్రం ఖచ్చితంగా భారత్‌లోనే నిర్వహిస్తామని ఈ సందర్భంగా బీసీసీఐ అధికారికంగా ధృవీకరించింది. ఇండియాలో క్రికెట్‌కు ఎంత ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ అభిమానుల కోసం ఏం చేయడానికైనా బీసీసీఐ సిద్దంగా ఉంటుందని గంగూలీ తెలిపారు. ఐపీఎల్ 2020 సీజన్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్ జట్టు.. ఇవాళ జరిగే క్వాలిఫయర్ విజేతతో తలపడనుంది. కాగా, వచ్చే సీజన్ 2021లో ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది బీసీసీఐ.
ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు భారతే ఆతిథ్యమిస్తోంది. దేశావాళీ టోర్నీలు కూడా భారత్‌లోనే నిర్వహిస్తామన్న గంగూలీ.. రంజీట్రోఫీ కోసం బయోబబుల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. నవంబర్ నుంచి గోవాలో ఐఎస్ఎల్ ప్రారంభం కాబోతోందని గంగూలీ మీడియాముఖంగా వెల్లడించారు. కాగా, ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు యూఏఈ నుంచే నేరుగా ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లనుంది.