end

రేపే నితీష్‌ ప్రమాణం..!

జేడీయూ నేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మరోసారి బిహార్‌ పగ్గాలు చేపట్టబోతున్నారు. రేపే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ రోజు జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో ఆయనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు గురించి ఈ సమావేశంలో చర్చించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర ఎన్డీయే పక్షాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అక్టోబరు, నవంబరు నెలల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత శాసన సభా పక్ష నేతను ఎన్నుకునేందుకు ఎన్డీయే కూటమి సమావేశం ఆదివారం పాట్నాలో జరిగింది. పాట్నాలోని 1, అన్నే మార్గ్‌లో ఉన్న నితీష్‌ కుమార్ అధికారిక నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఎన్డీయే శాసన సభా పక్ష నేతగా నితీష్‌ కుమార్‌ను, బీజేపీ శాసన సభా పక్ష నేతగా సుశీల్ మోదీని ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాగా, బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌ ‌కుమార్‌ నాలుగోసారి ప్రమాణం చేయనుండడం విశేషం.

ఎన్డీయే శాసన సభ్యుల సమావేశానికి ముందు జేడీయూ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నితీశ్ కుమార్‌ను జేడీయూ శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో నితీష్‌ కుమార్ బిహార్ గవర్నర్‌ను కలిసి, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. తమ ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్‌ కుమార్ అని ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. జేడీయూకు బీజేపీ కన్నా తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ నితీష్‌ కుమార్‌నే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామని బీజేపీ అగ్ర నేతలు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. జేడీయూ, బీజేపీ, వీఐపీ, హెచ్ఏఎం పార్టీలు కలిసి బిహార్ శాసన సభ ఎన్నికల్లో ఆర్జేడీ కూటమికి వ్యతిరేకంగా పోటీ చేశాయి. ఈ కూటమికి 125 స్థానాలు లభించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం దక్కింది. బీజేపీ 74, జేడీయూ 43, వీఐపీ 4, హెచ్ఏఎం 4 స్థానాలను సాధించాయి.

Exit mobile version