end

భారత్‌ బంద్‌కు మద్దతివ్వం: బెంగాల్‌ సీఎం

కోల్‌కతా : ఈ నెల 8న దేశరైతులు తలపెట్టిన భారత్‌బంద్‌కు తాము మద్దతివ్వబోమని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. తాము ‘బంద్’ కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని తెలిపిన ఆమె రైతుల డిమాండ్లకు మాత్రం పూర్తి మద్దతిస్తామని ప్రకటించారు.రైతులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే సవరించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. సవరణ చేయడం కుదరకపోతే మోదీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

వెస్ట్ మిడ్నాపూర్‌లోని ఓ ర్యాలీలో సీఎం మమతా మాట్లాడుతూ.. 2006 లో సింగూరు వేదికగా దాదాపు 26 రోజుల పాటు నిరశన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సింగూరులో జరిగిన కార్యక్రమాన్ని తామెన్నడూ మరిచిపోలేమన్నారు. బయటి వారికి బెంగాల్ లో ఎప్పటికీ ప్రవేశం ఉండదని, బెంగాల్ ప్రజలు కూడా వారికి ఎన్నడూ ప్రవేశం కల్పించకూడదని మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.

బెంగాల్ పై బీజేపీ పట్టు సాధించకుండా పోరాటం చేస్తూనే ఉంటానని, ప్రజలు కూడా బీజేపీని అడ్డుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఎంత సమర్థవంతంగా పనిచేసినా, ప్రతిపక్షాలు తమపై లేనిపోని బురదనే చల్లుతున్నాయని మండిపడ్డారు. రాఫెల్ అవినీతి, పీఎం కేర్స్ వివరాలను బహిర్గతం చేయరు కానీ.. తుపాను వల్ల జరిగిన నష్టం విషయంలో మాత్రం లెక్కలడుగుతున్నారని మమత తీవ్రంగా మండిపడ్డారు.

Exit mobile version