- ఎగువ మానేరు జలాశయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్
- మత్తడి వద్ద సందర్శకులు సెల్ఫీలు తీసుకోవడం నిషేధం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత వారం రోజుల నుండి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ మానేరు జలాశయం అలాగే అన్ని చెరువులు, కుంటలు నిండి పొర్లి ప్రవహించి వరద నీరు పోతునందున నియమించిన అధికారులు అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశించారు.
నర్మాల గ్రామ శివారులోని ఎగువ మానేరు జలాశయాన్ని సందర్శించి నీటి సామర్థ్యాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎగువ మానేరు నిండితే సందర్శకుల తాకిడి ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నందున అధికారులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే జలాశయం వద్ద ఒక వీఆర్ఏ, పోలీస్ అధికారి అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జలాశయం మత్తడి వద్ద సందర్శకులు సెల్ఫీలు తీసుకోవడం నిషేధమని తెలిపారు.
జలాశయం చుట్టు పక్కల మద్యపానం సేవించరాదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా జలాశయాన్ని చూడడానికి వచ్చే సందర్శకులను ఆకతాయిలు ఇబ్బందులు కలిగించకుండా పోలీస్ అధికారులు వారిపై నిఘా ఉంచాలన్నారు. అలాగే జలాశయాన్ని చూడడానికి వచ్చే సందర్శకులు కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ సుమ, పోలీసులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.