ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కాలుష్యం వల్ల ఇప్పటికే భూగ్రహం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అయితే ఈ పొల్యూషన్ ఎఫెక్ట్ కేవలం భూమికే పరిమితం కాకుండా మిగతా గ్రహాలపై కూడా పడుతోందని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సూర్యకాంతిలోని అతినీలాలోహిత కిరణాల నుంచి భూమిపై సమస్త జీవులకు రక్షణనిచ్చే ఓజోన్ పొర (ozone layer) కూడా ప్రమాదంలో ఉన్నట్లు శాస్ర్తవేత్తలు గుర్తించారు . అంతేకాదు 20వ శతాబ్దం చివరలో కొన్ని హానికరమైన రసాయనాలతో కూడిన మానవ ఉద్గారాలు వాతావరణంలోని ఓజోన్ అణువుల సంఖ్యను ప్రభావితం చేయడం ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇలా ప్రతి ఏటా ఎదురవుతున్న సంక్లిష్టమైన వాతావరణ, రసాయన ప్రక్రియల వల్ల అంటార్కిటికాపై (Antarctica) ఒక రంధ్రం తెరుచుకుంటోందని, దీని వల్ల అనేక దుష్ప్రభావాలుంటాయని హెచ్చరిస్తున్నారు.
1987లో మానవ నిర్మిత రసాయనాలు ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్న ఏడేళ్ల (7 years) తర్వాత వాతావరణంలోని హానికరమైన రసాయనాల మొత్తాన్ని అరికట్టేందుకు మాంట్రియల్ ప్రోటోకాల్‌పై (Montreal Protocol) ప్రపంచ దేశాలు సంతకం చేశాయి. గతంలో రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, హెయిర్ స్ప్రే, ఇండస్ట్రియల్ క్లీనింగ్ ప్రొడక్ట్స్‌లో కనిపించే ఈ రసాయనాలను (chemicals) ఓజోన్ పొరను రక్షించేందుకు గాను దశలవారీగా తొలగించడం ప్రారంభించారు. మొత్తం 197 పార్టీలు ఇందుకోసం అంగీకరించగా.. ఐక్యరాజ్య సమితి (United Nations) చరిత్రలో సార్వత్రికంగా ఆమోదించబడిన మొట్టమొదటి ఒప్పందాల్లో ఇదీ ఒకటి. కాగా ఇటీవల USలోని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్(NOAA) చేసిన కొత్త పరిశోధనలో ఓజోన్ పొరను దెబ్బతీసే హానికరమైన రసాయనాల సాంద్రతలు పడిపోయాయని కనుగొన్నారు.
పునరుద్ధరణలో సాధించిన ప్రగతి:
1980తో పోలిస్తే స్ట్రాటో అట్మాస్పియర్ మిడ్ లెవెల్‌లో (Mid Level of Stratosphere) హానికరమైన రసాయనాల సాంద్రతలు 50 శాతానికి పైగా తగ్గాయని NOAA శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రికవరీ దిశలో ఈ మార్పును గుర్తించదగిన మైలురాయిగా పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ హానికర రసాయనాల వాతావరణ స్థాయిలు క్షీణించడం కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. అంటార్కిటికాపై రసాయనాల సాంద్రతలు పడిపోతున్నాయి కానీ ఫలితాల రేటు చాలా నెమ్మదిగా ఉన్నట్లు తెలిపారు. 2021లో పరిమాణంలో ఖండం కంటే పెద్దగా ఉన్న ఈ హోల్ (Hole) నుంచి.. ఓజోన్ పొర 2070 నాటికి పూర్తిగా కోలుకోగలదని NOAA అంచనా వేసింది.
3D ఇమేజింగ్ ద్వారా పర్యవేక్షణ:
ఓజోన్ పొరకు సంబంధించిన ఈ హోల్ (Hole) పూర్తిగా మూసుకుపోయే వరకు కోపర్నికస్ అట్మాస్పియర్ మానిటరింగ్ సర్వీస్(CAMS) ద్వారా ట్రాక్ చేయబడుతుంది. సాధారణంగా ఈ రంధ్రం దక్షిణ అర్ధగోళంలో వసంతకాలంలో(ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు) ఏర్పడటం ప్రారంభమవుతుంది. సెప్టెంబరు-అక్టోబరు మధ్య దాని గరిష్ట పరిమాణాన్ని చేరుకుంటుంది. ఆపై డిసెంబర్ చివరి నాటికి ఓజోన్ స్థాయిలు సాధారణ స్థితికి వస్తాయి. కాగా ఈ ఏడాది CAMS శాస్త్రవేత్తలు త్రీ-డైమెన్షనల్ మోడలింగ్‌ను (three-dimensional modeling) ఉపయోగించి ఆగస్టు నుంచి ఈ రంధ్రం అభివృద్ధిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు.