end

ఒకడినై వచ్చానంటూ పవన్…

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికార పార్టీ పెద్దలపై ఘాటు విమర్శలు చేశారు. తప్పుడు హామీలతో ప్రజలను మభ్య పెట్టి మరీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఆ హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రభుత్వం మెడలు వంచి హామీలను నెరవేర్చుకుంటామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రెండో విడత జనవాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు. పవన్ కల్యాణ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పలువురు పార్టీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. స్థానికుల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులపై వారు పలు ఆరోపణలు చేశారు.

తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలో తమ భూమిని వైసీపీ ఎంపీటీసీ కబ్జా చేశారని బాధితులు చెప్పారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, తిరుపతి జిల్లాల నుంచి పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తాము ఎదుర్కొంటోన్న ఇబ్బందులు, సమస్యలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లి అక్కడి ప్రజలు వాపోయారు. కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు, దివ్యాంగులు పవన్ కల్యాణ్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్ జగన్ తన పాదయాత్ర సమయంలో నోటికి వచ్చినట్టు హామీలను ఇచ్చారని ఇప్పుడు వాటిని నెరవేర్చలేక చేతులెత్తేశాడని ఆరోపించారు. నేను ఉన్నాను నేను విన్నాను అంటూ ఇష్టానుసారంగా హామీలు చేశారని విమర్శించారు. నవరత్నాలను ప్రజలకు ఇచ్చేశామని వైసీపీ నాయకులు చెప్పుకొంటూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. దివ్యాంగుల సమస్యలను సైతం ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. వారిని కూడా ఇబ్బందులకు గురి చేసేలా ప్రభుత్వం దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారు అని మండిపడ్డారు.

తాను జనవాణి వంటి కార్యక్రమాలు చేపట్టడం సాహసంతో కూడుకున్నదని పవన్‌ కళ్యాణ్ అన్నారు. జనవాణి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపట్టాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.

Exit mobile version