న్యూఢిల్లీ : ప్రధాని మోదీ మంగళవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల పరిస్థితులు, కోవిడ్ వ్యాప్తి అంశాలపై ఈ కాన్ఫెరెన్స్‌లో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మూడో దశలో ఉన్న నేపథ్యంలో.. వ్యాక్సిన్ పంపిణీ ఎలా చేయాలన్న అంశంపై కూడా మోదీ సీఎంలతో చర్చించనున్నారు. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ రెండు దఫాలుగా జరగనుంది. ఇప్పటికే కరోనా వ్యాప్తి, వ్యాక్సిన్ పై నీతి ఆయోగ్ ఓ సమావేశాన్ని నిర్వహించింది. వ్యాక్సిన్‌కు ఎంత ధర నిర్ణయించాలన్నది కూడా నీతి ఆయోగ్ సభ్యుల మధ్య చర్చకు వచ్చింది. ఇక.. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తికాని వ్యాక్సిన్‌లను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అన్ని విషయాలను ప్రధాని సీఎంలతో సవివరంగా చర్చించనున్నారు.