హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ప్రధాన పార్టీగా పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ తగిలింది. జాంబాగ్ ఎంఐఎం అభ్యర్థి రవీందర్ కోసం ప్రచారానికి వెళ్లిన ఓవైసీని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. వరద సాయంపై ప్రశ్నల వర్షం కురిపించారు. తమకు వరద సాయం అందలేదని నిలదీశారు. గతంలో ఎంఐఎంని గెలిపిస్తే జాంబాగ్‌లో ఎలాంటి అభివృద్ధి లేదని, ఐదేళ్లకోసారి వచ్చి ఓట్లు అడిగి.. గెలవగానే ముఖం చాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ఆందోళనతో అసదుద్దీన్ ఓవైసీ వెనుదిరిగారు. నగరంలో పలుచోట్ల ఇలాంటి దృశ్యాలు కనపడుతున్నాయి. ఎమ్మెల్యేలకు, అభ్యర్థులకు, నాయకులకు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు.