జమ్మూ కశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహ వద్ద ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. కుంభవృష్టి అనంతరం వరద పోటెత్తింది.అమర్‌నాథ్ యాత్రలో ఆకస్మికంగా వచ్చిన వరదల్లో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఆయన కుటుంబం త్రుటిలో తప్పించుకున్నారు. తన జీవితంలో ఇలాంటి విపత్తు చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్‌నాథ్ యాత్రలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది. మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులపై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఆకస్మికంగా వచ్చిన వరదల కారణంగా 15 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా.. 40 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన భక్తులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రంగంలోకి దిగిన ఆర్మీ పలువురు అనేక మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. గల్లంతైన వారి కోసం హెలికాప్టర్ల సాయంతో గాలిస్తున్నారు.
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వరదల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వరద ముంచెత్తిన సమయంలో రాజాసింగ్ సమీపంలో ఉన్నారట. ఈ మేరకు సంఘటనా స్థలం నుంచి తీసిన వీడియోను ఆయన మీడియాకు పంపించారు. తాను అమర్‌నాథ్‌లోని మంచు లింగాన్ని దర్శించుకుని వెళ్లిన పది నిమిషాల్లోనే వరదలు వచ్చాయని రాజాసింగ్ తెలిపారు. ఆ ప్రాంతంలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు. తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్ ద్వారా వెళ్లాలనుకున్నామని.. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో గుర్రాలపై వచ్చామని తెలిపారు. ఆకస్మికంగా వరదలు రావడంతో మిగిలిన వారు ఏం చేయలేని పరిస్థితి నెలకొందని.. తన కళ్లముందే చాలామంది వరదల్లో కొట్టుకుపోయారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మీ జవాన్లు తమ ప్రాణాలకు తెగించి ఎంతో మందిని కాపాడారని కొనియాడారు.