end

రజనీ ఔట్‌.. విజయ్‌ ఇన్..!

తమిళ తలైవాగా పేరొందిన రజినీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దళపతి విజయ్‌ ఎపిసోడ్ షురూ అవబోతోంది. తమిళనాట రజనీ తర్వాత అంత ఇమేజ్ ఉన్న హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖాయమనే వార్త వినిపిస్తోంది. ఈనెలాఖరున.. అంటే డిసెంబర్‌ 31న విజయ్ కొత్త పార్టీ అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి దగ్గర దళపతి పార్టీ వివరాల్ని ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమిళనాట రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. తాజాగా పొలిటికల్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న రజనీకాంత్ సడెన్‌గా రాజకీయాల్లోకి రానని అనేసరికి ఇప్పుడు అందరి చూపు విజయ్‌పై పడింది. రజనీ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన విరమించుకోవడంతో విజయ్‌ పని సులువయ్యిందని భావిస్తున్నారు. విజయ్‌ త్వరలోనే పార్టీ ప్రకటిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి నిజంగానే దళపతి రాజకీయాల్లోకి వస్తున్నారా..?

విజయ్‌ రాజకీయాల్లోకి వస్తారని రెండేళ్లుగా అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. నెల క్రితం విజయ్ తండ్రి, ప్రముఖ ప్రొడ్యూసర్ ఎస్‌ఏ చంద్రశేఖరన్‌ తన కుమారుడు విజయ్‌ పేరుతో ఓ పార్టీ ప్రకటించి.. ఎన్నికల సంఘం గుర్తింపు కోసందరఖాస్తు చేసుకున్నారు. దాంతో దళపతి రాజకీయ అరంగేట్రం ఖాయమైందని అంతా అనుకున్నారు. మరుసటి రోజేవిజయ్‌ స్పందించి.. అబ్బే అటువంటిదేంలేదని తేల్చిచెప్పారు. తన తండ్రి పెట్టిన పార్టీకి, తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ కూడా ఇచ్చారు. తన అభిమాన సంఘం విజయ్ మక్కళ్‌ ఇయక్కమ్‌ సభ్యులెవరూ తన తండ్రి ప్రకటించిన పార్టీలో చేరవద్దని చాలా ఓపెన్‌గా చెప్పారు. దీంతో విజయ్‌ ఇక రాజకీయాల్లోకి రారని అందరూ అనుకున్నారు.

ఇలావుంటే.. కొద్దిరోజుల క్రితం మక్కళ్‌ ఇయక్కమ్‌ కార్యదర్శులతో విజయ్‌ అనధికారికంగా సమావేశమయ్యారు. తొందరపడి ఎవరూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. మరే ఇతర రాజకీయ పార్టీలోనూ చేరవద్దని చెప్పారు. అందరూ ఎదురుచూస్తున్న క్షణం త్వరలోనే వస్తుందని, తన నుంచి మంచి ప్రకటన వెలువడుతుందని విజయ్‌ ప్రకటించారు. ఒకరకంగా ఇది తన రాజకీయ ప్రవేశంపై తమిళనాడు ప్రజానీకానికి విజయ్ ఇచ్చిన ఒక స్పష్టమైన సందేశంగా భావించాలి. ఈ ప్రకటన తర్వాత దళపతి రాజకీయాల్లోకి రావడం ఖాయమనే అభిప్రాయానికి అభిమానులు వచ్చేశారు.

విజయ్‌కు తమిళనాట మంచి ఫాలోయింగ్‌ ఉంది. రజనీకాంత్‌ తర్వాత అంతటి అభిమానులున్న నటుడు విజయ్. అందులో అనుమానమే లేదు. కాకపోతే.. అటు రజనీ, ఇటు కమల్ హాసన్.. మరోపక్క డీఎంకే ప్రభంజనం.. ఇన్నింటి మధ్య విజయ్ ఎలా నెగ్గుకురాగలడనే సందేహం ఫాన్స్‌లో ఉంది. ఇప్పుడు విజయ్ అభిమానులు మెచ్చేలా రజనీ రూట్ క్లియర్ చేశారు. దాంతో ఇక విజయ్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారంటూ మళ్లీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు విజయ్‌.. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయింది. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని, మాస్టర్‌ సినిమా రిలీజ్‌పై మాట్లాడటానికే విజయ్ సీఎంను కలిశారని సమాచారం.

Exit mobile version