హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 1 నుంచి 20 వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 3న ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ పరీక్ష జరగనుండగా.. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
కాగా, ఇంటర్ పరీక్షల ప్రశ్నాపత్రాల్లో ఈ సారి ఛాయిస్ 50 శాతానికి పెరగనుంది. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు కొంత వెసులుబాటు ఇవ్వాలని ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ముఖ్యంగా ఎంపీసీ, బీపీసీ గ్రూపుల్లో ప్రతి ప్రశ్నాపత్రంలో మూడు సెక్షన్లు ఉండగా.. రెండింటిలో 50 శాతం ఛాయిస్ ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఒకటి లేదా రెండు ప్రశ్నలకు మాత్రమే ఛాయిస్ కింద ప్రశ్నలు ఇచ్చేవారు.