తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి నియమించబడతారా..? అంటే ఔననే సమాధానం వస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరాదిఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఉత్తమ్ రాజీనామా అనంతరం కాంగ్రెస్‌ను నడిపించగల సమర్థవంతమైన నాయకుడెవరని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా, ఇటీవల ఓ మీడియా సంస్థ..టీపీసీసీ చీఫ్ ఎవరైతే బాగుంటుందని, పార్టీ బలోపేతానికి కృషి చేసే సమర్థవంతమైన నాయకుడెవరని ఓ పోల్ నిర్వహించింది. అందులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, మల్లు భట్టివిక్రమార్క పేర్లను ఆప్షన్లుగా సూచించింది. ఇందుకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రేవంత్ రెడ్డి అయితేనే కాంగ్రెస్‌కు మళ్లీ పూర్వ వైభవం తేగలడని అధిక సంఖ్యలో ఓట్లు వచ్చాయి. ఈ పోల్‌లో మొత్తం 5,22,768 ఓట్లు పోలవ్వగా.. రేవంత్ రెడ్డికి ఏకంగా 4,07,238 ఓట్లు రావడం విశేషం. మిగితా ముగ్గురు లీడర్లకు కలిపి మొత్తం 1,15,530 ఓట్లు మాత్రమే వచ్చాయి. వీరిలో కోమటి వెంకట్ రెడ్డికి 67,704 ఓట్లు, భట్టి విక్రమార్కకు 26,990 ఓట్లు, శ్రీధర్ బాబుకు 20,836 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కాంగ్రెస్ ఏ ఎన్నికల్లోనూ విజయం సాధించలేదు. ఎక్కడో అడపా దడపా కొన్ని స్థానాలు గెలిచినా అవి పరిగణలోకి రాలేవు. అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీ ఎలక్షన్స్, ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఇలా.. అన్నింటిలోనూ కాంగ్రెస్ మునుపెన్నడూ లేని పరాజయాలు చవిచూసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానానికి సరిపడా సీట్లు పొందినప్పటికీ, ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయారు. గెలిచిన వారిలో సగంపైగా ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి జంపయ్యారు. దీనికి తోడు ఉత్తమ్ వాగ్ధాటి ప్రత్యర్థులకు సవాల్‌గా నిలవలేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు.