end

రూ.13.50 లక్షల విలువైన 90 కిలోల గంజాయి పట్టివేత

సారపాక: గుట్టుచప్పుడు కాకుండా ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న 90 కిలోల గంజాయిని బూర్గంపహాడ్ పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుకున్నారు. ఈ సంఘటన సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక-మణుగూరు క్రాస్ రోడ్లో చోటుచేసుకుంది. పాల్వంచ సీఐ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం.. బూర్గంపహాడ్ ఎస్సై బమ్మెర బాలకృష్ణ తన సిబ్బందితో సారపాక నుంచి మణుగూరు క్రాస్ రోడ్డు వరకు కల్వర్టు చెకింగ్ చేస్తుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో పుష్కరవనం వద్ద కొందరు వ్యక్తులు రెండు ఆటోలు, ఒక కారుతో అనుమానాస్పదంగా కనిపించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా సారపాకకు చెందిన ఆటో డ్రైవర్లు నాగు విజయ్, నాగు సందీప్ సన్నీళ్ల ప్రేమ్కుమార్, మానుపెల్లి రామాంజనేయులు, రాసమళ్ల ప్రశాంత్ పట్టుబడ్డారు. మరికొందరు పరారయ్యారు. 

పరారైన కొందరు ఒక టీంగా ఏర్పడి గత కొంతకాలంగా వారు నడుపుతున్న ఆటోల్లో గంజాయిని ఒడిశా సరిహద్దు నుంచి తీసుకువచ్చి గంజాయి కావాల్సిన వారిని పిలిపించుకొని కారులో వివిధ ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఈ గంజాయి వ్యాపారంలో సంబంధం ఉన్న వారిని గుర్తించి త్వరలో అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు. నిందితుల నుంచి రూ.13.50 లక్షల విలువైన 47 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి రవాణాకు వినియోగించిన రెండు ఆటోలు, ఒక కారు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. గంజాయి పట్టుకున్న ఎస్సై బమ్మెర బాలకృష్ణ, పోలీసు సిబ్బందిని సీఐ నవీన్‌ అభినందించారు.

Exit mobile version