భారత సంతతికి చెందిన జడ్జి రూపాలీ హెచ్.దేశాయ్ చరిత్ర సృష్టించారు. యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో తొమ్మిదో సర్క్యూట్‌కు సంబంధించి భారతీయ అమెరికన్ లిటిగేటర్ రూపాలి హెచ్ దేశాయ్ నియామకాన్ని అమెరికా సెనేట్ ధృవీకరించింది.తద్వారా ఈ శక్తివంతమైన కోర్టులో కీలక పదవిని అందుకున్న తొలి దక్షిణాసియా న్యాయమూర్తిగా ఆమె రికార్డుల్లోకెక్కారు. దక్షిణాసియా నుంచి ఈ ఘనత సాధించిన తొలి జడ్జి ఆమే. 44 ఏళ్ల రూపాలీ నియామకానికి సెనేట్ 67–29 ఓట్లతో ఆమోదముద్ర వేసింది. ఆరిజోనా స్కూల్ ఆఫ్ లాలో గ్రాడ్యుయేట్, న్యాయమూర్తి మేరీ ష్రోడర్‌కు క్లర్క్, ఇప్పుడు తొమ్మిదో సర్క్యూట్ చీఫ్ జడ్జిగా పనిచేసిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారని షుమెర్ ప్రశంసించారు.
ఆరిజోనా రాష్ట్రానికి చెందిన అగ్రశ్రేణి ఎన్నికల న్యాయవాదులలో ఆమె ఒకరని.2020లో తన రాష్ట్ర ఎన్నికలను రక్షించడంలో దేశాయ్ కీలకపాత్ర పోషించారని ఆయన అన్నారు.కోవిడ్ మహమ్మారి సమయంలో పెంపుడు వ్యక్తుల సంరక్షణలో వున్న పిల్లల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల వరకు ఆమె పోరాడారని షుమెర్ కొనియాడారు. తొమ్మిదో సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కు యూఎస్ న్యాయమూర్తిగా రూపాలి దేశాయ్ నియామకాన్ని ధృవీకరించినందుకు ఆరిజోనా గర్విస్తోందన్నారు.సమగ్రత, న్యాయబద్ధత, చట్టపరమైన పరిజ్ఞానానికి ఇది ఆమెకు దక్కిన గౌరవమన్నారు.
రూపాలీ 1978లో కెనడాలో జన్మించారు. అమెరికాలో న్యాయవాదిగా, న్యాయ నిపుణురాలిగా 16 ఏళ్ల అనుభవం ఆమె సొంతం. అరిజోనా వర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో మాస్టర్స్‌చేశారు. మెరిట్ స్టూడెంట్‌గా పేరు తెచ్చుకున్నారు. 2007 నుంచి కాపర్‌స్మిత్ బ్రోకెల్‌మన్ లా సంస్థలో పార్టనర్‌గా ఉన్నారు. 2021లో కీలకమైన అమెరికన్ లా ఇన్‌స్టిట్యూట్‌లో మెంబర్‌గా చేరారు. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అరిజోనా రాష్ట్రంలో జో బైడెన్ గెలుపును సవాలు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వేసిన కేసులో ట్రంప్‌కు వ్యతిరేకంగా సమర్థంగా వాదనలు విన్పించి ఆకట్టుకున్నారు.