కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని ఆరాటపడుతున్న వారికి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ శుభవార్త తెలిపింది. గృహ రుణాల వడ్డీరేటును భారీగా తగ్గించి సొంతింటి కలను నిజం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. గృహ రుణాల వడ్డీరేటుపై 30 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) రాయితీ ఇవ్వనున్నట్టు తాజాగా ప్రకటించింది. అలాగే, ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు తెలిపింది. రూ. 30 లక్షల వరకు 6.80 శాతం, ఆపైన 6.95 శాతం వడ్డీతో గృహ రుణాలు ఇవ్వనున్నట్టు తెలిపింది. అయితే, ఈ వడ్డీ రేటు సిబిల్ స్కోరుపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. రూ. 5 కోట్ల వరకు రుణాలపై 30 బేసిస్ పాయింట్ల రాయితీ దేశంలోని ఎనిమిది మెట్రో నగరాల్లో అందుబాటులో ఉంటుందని భారతీయ స్టేట్ బ్యాంకు తెలిపింది.
మహిళలకు 5 బేసిస్ పాయింట్ల రాయితీ ఇవ్వనున్నట్టు పేర్కొంది. రాయితీలను మెరుగుపరిచినందుకు ఎస్‌బీఐ సంతోషం వ్యక్తం చేసింది. అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుండడంతో ఇళ్ల కొనుగోలుకు మరింత మంది ఆసక్తి చూపిస్తారని ఎస్‌బీఐ ఎండీ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి తెలిపారు.