హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గతకొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విజయశాంతి మంగళవారం కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. అనంతరం ఢిల్లీలో పలువురు పార్టీ, కేంద్ర పెద్దలతో భేటీ కానున్నారు. ఈ మేరకు బీజేపీ వర్గాల ద్వారా సోమవారం సమచారం అందింది. అంతేకాకుండా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరుఫున విజయశాంతి ప్రచారం చేయనున్నారు.
దుబ్బాక ఎన్నికల సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విజయశాంతితో మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొన్ని రోజుల పాటు ఆమె సహచరులతో సమాలోచనలు జరిపి.. పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కీలకమైన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఈ పరిణామం భారీ ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న విజయశాంతికి బీజేపీలో చేరిన అనంతరం కీలకమైన బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. కాగా సుమారు రెండు దశాబ్ధాల అనంతరం మరోసారి సొంత గూటికి చేరుకుంటున్నారు. బీజేపీ ద్వారానే ఆమె రాజకీయాల్లో అడుగుపెట్టారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్‌నటిగా ఖ్యాతిగడించిన విజయశాంతి.. 2000 సంవత్సరంలో రాజకీయ అరంగేట్రం చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యహరించి.. టీఆర్‌ఎస్ నుంచి 2009లో మెదక్ ఎంపీగా విజయం సాధించారు. తెలంగాణ వాదాన్ని ఢిల్లీ నుంచి గల్లీ వరకు వినిపించి.. ఉద్యమ నేతగా ఎదిగారు. అనంతర కాలంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు.