సోనూసూద్.. ఈ పేరు వినగానే సినిమాల్లో విలన్‌గా గుర్తొచ్చేవాడు. ఓ సాధారణ నటుడిగా సగటు ప్రేక్షకులు అనుకునేవారు. కానీ, కరోనా కష్ట కాలంలో తన నిజస్వరూపాన్ని చూశారు జనాలు. రాజకీయ నాయకులు, సనీనటులు, సెలబ్రిటీలు ఇలా ఎవరికి వారు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆర్థిక సాయం చేసినప్పటికీ.. ఆపదలో ఉన్న వారి బాగోగులు చూసుకోవడం, వారికి బాసటగా నిలవడం ఎవ్వరూ చేయలేదు. అలాంటి సమయంలో వచ్చాడు ఓ రియల్ హీరో. అతనే సోనూసూద్. వలస కార్మికులకు, పేదలకు అండగా నిలిచాడు. వారి కష్టాలు తెలుసుకొని, వారిని ఆదుకున్నాడు. వివిధ రాష్ట్రాల వలస కూలీలను తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడు. వారికి ఆర్థిక సాయం చేశాడు. ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారికి చికిత్సలు చేయించాడు. ఇవన్నీ చేసి కూడా ఓ సాధారణ పౌరుడిగానే ఉన్నాడు సోనూ. దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల పంజాబ్ స్టేట్ ఐకాన్‌గానూ నియమితుడయ్యాడు.
సోనూసూద్ తాజాగా మరో ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ ఫాలోయింగ్‌లో సోనూ బాలీవుడ్ సూపర్‌స్టార్లను సైతం వెనక్కి నెట్టేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. సోషల్ మీడియా అనలిటిక్స్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ట్విటర్‌లో భారత్‌లో అత్యధిక ఫాలోయింగ్ కలిగిన వ్యక్తుల జాబితాలో ఓవరాల్‌గా సోనూసూద్ నాలుగో స్థానం దక్కించుకున్నాడు. ఈ జాబితాలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తరువాత రాహుల్ గాంధీ, విరాట్ కోహ్లీ, సోను సూద్ ఉన్నారు. ఫాలోయింగ్ విషయంలో బాలీవుడ్ ప్రముఖ స్టార్లందరినీ సోనూసూద్ వెనక్కి నెట్టేయడంలో అర్థముంది కదా.