end
=
Saturday, November 23, 2024
వార్తలుజాతీయంనూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- Advertisment -

నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

- Advertisment -
- Advertisment -

న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై రోజురోజుకీ పోరాటాలు ఉధృతమవుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నూతన చట్టాలను మీరు నిలుపుదల చేస్తారా? లేదంటే మమ్మల్ని చేయమంటారా? ఇందులో అహం ఎందుకు? ఏదైనా తప్పు జరిగితే మనలో ప్రతి ఒక్కరమూ బాధ్యత వహించాలి. ఆందోళనల్లో పాల్గొన్న కొంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహిళలు, వృద్ధులు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అసలు ఏం జరుగుతోంది?’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టాలను రద్దు చేయమని తాము అనడం లేదని, సమస్యకు పరిష్కారం కనుగొనడమే తమ లక్ష్యమని సుప్రీం స్పష్టం చేసింది. అయితే చట్టాల్ని కొంత కాలం నిలిపేయగలరా? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పలు పిటిషన్లపై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. రైతుల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయిందని, అందుకే సోమవారం తామే ఓ నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ బోబ్డే స్పష్టం చేశారు.

ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని సుప్రీం పేర్కొంది. చట్టాలను కేంద్రమే తీసుకొచ్చిందని, దానిని సరైన పద్ధతిలో అమలు చేసే బాధ్యత కూడా కేంద్రానిదే అని సుప్రీం స్పష్టం చేసింది. సాగు చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య జరుగుతున్న ప్రక్రియపై తాము అసంతృప్తిగా ఉన్నామని, కేంద్రం నిర్వహిస్తున్న చర్చల్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. రైతు సంఘాల తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తమ వాదనలను వినిపించారు. రామ్‌లీలా మైదానంలో నిరసన తెలపడానికి అనుమతించాలని ఆయన కోరారు. అయితే ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడే ఉద్దేశం రైతులకు లేదని దవే సుప్రీంకు స్పష్టం చేశారు. ఇంతటి ముఖ్యమైన చట్టాలను మూజువాణీ ఓటుతో ఎలా ఆమోదింపజేసుకుంటారని ప్రశ్నించారు. కేంద్రానికి అంతలా శ్రద్థ ఉంటే ఉభయ సభలను సమావేశపరిచి ఉండాలని, ప్రభుత్వం అలా ఎందుకు చేయలేదని దవే ప్రశ్నించారు.

అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ప్రభుత్వం తరపున తమ వాదనలను వినిపించారు. హర్యానా సీఎం ఖట్టర్ విషయంలో జరిగినట్లుగా జరగకూడదన్నదే తమ అభిమతమని అన్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవమని, అంతటి ప్రాముఖ్యం ఉన్న రోజున ఇబ్బంది పెట్టడానికి రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తున్నారని ఆయన సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. చట్టాలను నిలిపివేయడం మాత్రం కుదరదని, దీనిపై సుప్రీం ఓ కమిటీని ఏర్పాటు చేయవచ్చని ఆయన అన్నారు. ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగ నిబంధనలకు ఏ చట్టమైనా వ్యతిరేకంగా ఉంటే తప్ప, చట్టాన్ని నిలిపేసే హక్కు కోర్టుకు లేదని అటార్నీ జనరల్ స్పష్టం చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -