పాలను తాగడం వల్ల శరీరానికి అవసరమయ్యే కాల్షియంతోపాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. ఎముకలకి చాలా దృడత్వాన్ని కల్గిస్తాయి. పాలను తాగడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే కొన్నిసార్లు మనం వేడిచేసేటప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి. ఈ విరిగిన పాలను సాధారణంగా చాలా మంది పారబోస్తూ ఉంటారు. విరిగిన పాలను పారబోయకుండా వాటితో ఎంతో రుచిగా పాలకోవాను తయారు చేసుకోవచ్చు. ఆ పాలతో పాలకోవాను ఎలా తయారు చేయాలో చూద్దాం.
తయారీకి కావల్సిన పదార్థాలు:
విరిగిన పాలు – ఒక లీటర్, పంచదార – ముప్పావు కప్పు, నిమ్మరసం – అర టీస్పూన్
ముందుగా విరిగిన పాలలో అర టీ స్పూన్ నిమ్మరసం వేసి పూర్తిగా విరిగే వరకు వేడి చేయాలి. తరువాత ఈ పాల విరుగుడును తీసుకుని వాటిలోని నీరు అంతా పోయేలా చేసుకోవాలి. తరువాత ఈ పాల ను నీళ్లు పోసుకుంటూ మరోసారి శుభ్రపరచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మరో గిన్నెలోకి తీసుకోవాలి. పంచదారను వేసి చిన్న మంటపై పంచదార పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి విరుగుడులోని నీరు అంతాపోయి దగ్గర పడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు గుత్తి సహాయంతో పాల విరుగుడు మిశ్రమాన్ని పూర్తిగా మెత్తగా చేసుకోవాలి. తరువాత చేతికి నెయ్యిని రాసుకొని పాలవిరుగుడు మిశ్రమాన్ని తగిన పరిమాణంలో తీసుకుంటూ చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలకోవా తయారవుతుంది. చివరిగా జీడిపప్పు లేదా బాదంపప్పు తో గార్నిష్ చేసుకోండి. ఈసారి మీ ఇంట్లో పాలు విరిగినప్పుడు వాటిని పారబోయకుండా ఇలా పాలకోవాగా చేసుకుని తినిచూడండి. ఇలా చేసిన పాలకోవా వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.