న్యూఢిల్లీ: బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) రేపు జరగనుంది. ఈ సమావేశం మొత్తం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చుట్టూనే తిరిగే అవకాశం ఉంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం ప్రధానంగా చర్చకు రావొచ్చు. గంగూలీ బోర్డు అధ్యక్షుడిగా ఉంటూనే భిన్నపాత్రలు పోషిస్తున్నందున ఆయనను నిలదీసేందుకు సభ్యులు సమాయత్తమవుతున్నట్టు సమాచారం. మొతేరాలో కొత్తగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో గురువారం ఏజీఎం జరగనుంది.
బోర్డు స్పాన్సర్ల ప్రత్యర్థి కంపెనీలకు గంగూలీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం సభ్యులను చికాకు పెట్టిస్తోంది. సౌరవ్ తీరును ఆక్షేపిస్తూ మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ చేసిన కామెంట్లపైనా చర్చ నడిచే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ.. ప్రతీ విషయంలో గంగూలీ తలదూర్చుతున్నాడు. సెలెక్టర్ల తరఫునా ప్రకటనలు చేస్తాడు. ఐపీఎల్ విషయంలోనూ లీగ్ చైర్మన్ తరహాలో మాట్లాడతాడని విమర్శించాడు.