సచిన్ టెండూల్కర్.. ఈ పేరు వినగానే అతడిని క్రికెట్ దేవుడంటారు అభిమానులు. మాస్టర్ బ్లాస్టర్, లిటిల్ మాస్టర్, సెంచరీల కింగ్ ఇలా ఎన్నెన్నో పేర్లు క్రికెట్ ప్రియుల మదిలో మెదులుతాయి. కాగా, సచిన్.. 1989లో సరిగ్గా ఇదే రోజు మైదానంలో అడుగుపెట్టాడు. పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో సచిన్ భారత్ తరఫున మైదానంలోకి అడుగుపెట్టాడు. అప్పుడు అతడి వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. ఈ మ్యాచ్‌తోనే పాక్ పేసర్ వకార్ యూనిస్ కూడా తొలిసారి మైదానంలో అడుగుపెట్టాడు. యాదృచ్ఛికమో ఏమో గానీ, వకార్ బౌలింగ్‌లోనే సచిన్ 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసిందనుకోండి.
అనంతరం, ఆనతికాలంలోనే టెండూల్కర్ భారత ప్రధాన బ్యాట్స్‌మెన్‌గా ఎదిగాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ, టన్నుల కొద్ది పరుగులు చేస్తూ.. ప్రపంచంలోని మేటి బౌలర్లకు సైతం కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. అతడిని చూసి గేలిచేసిన బౌలర్లే.. అతడికి సలాం చేశారంటే సచిన్ ప్రభావం భారత క్రికెట్‌లో ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. గ్రేట్ బ్యాట్స్‌మెన్, మాస్టర్‌బ్లాస్టర్ లాంటి బిరుదులు సొంతం చేసుకున్నాడు సచిన్.
2013లో సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అప్పటికే అతడు టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా పేరు లిఖించుకున్నాడు. పోయిన ఏడాది సచిన్ ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ గౌరవం పొందిన 6వ భారత క్రికెటర్ సచిన్. అన్ని ఫార్మాట్లలో కలిపి సచిన్ 34,357 పరుగులు సాధించాడు. రెండో స్థానంలో ఉన్న సంగక్కరకు, సచిన్‌కు 6వేల పరుగుల వ్యత్యాసం ఉంది. ఇద్దరూ క్రికెట్ నుంచి రిటైరయ్యారు. ఇప్పట్లో ఆ రికార్డులకు ఎవ్వరూ దరిదాపుల్లో కూడా లేరనే విషయం తెలిసిందే కదా.
ప్రస్తుతం, సచిన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇది వరకు ముంబై జట్టుకు ఆటగాడిగా, కెప్టెన్‌గా ఆయన ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాలంలో మేటి క్రికెటర్లుగా ఎదిగిన చాలా మంది మాకు స్ఫూర్తి సచిన్ అంటారంటే అతిశయోక్తి కాదు.