- అరే.. పొద్దుగాల జెల్ది లేపురీ
- మీ గోడకాడికొచ్చి కూతేస్తం తియ్
Bathukamma : తెల్లారితే ఎంగిలిపువ్వు బతుకమ్మ. ‘అరే.. పొద్దుగాల జెల్ది లేపురీ. పోయిన బత్కమ్మకే నాకు చెప్పకుండ చెయ్యకుండ పోయిరు. ఈసారిగూడ అట్లనేజేస్తే ఇగ దోస్త్‍కటీఫ్’ అని దోస్తులకు ముందుగాల్నే చెప్పి వెట్టిన. ‘మబ్బుల నాలిగింటికే పోదాం. ఆ టైమ్‌కు అందరం అర్గుల కాడ కల్సుకోవాలె’ అని డిసైడ్ అయినం. ‘మీ ఇగురం సల్లగుండా. మా ఇంట్ల గడియారమెక్కడిది? టైం నాలుగైందో, ఐదైందో నాకెట్లా తెలుస్తది’ అంటుండంగనే ‘మీ గోడకాడికొచ్చి కూతేస్తం తియ్. ముందే చెప్తున్నం.. మూణ్నాలుగు కూతలకంటె ఎక్కువెయ్యం సూడూ’ అన్నరు. సరే అని మాటిచ్చి ఇంట్లవడ్డ.
కోడికూడా కూసిందో లేదో. బైటి నుంచి ‘రాజూ’ అని కూతలు వినిపిస్తున్నయి. నాకేమో లేవబుద్దియితలేదు. నిద్ర మంచి మోఖమీదుంది. ‘ఎంత మబ్బు పోరనివిరా.. తోటి పోరగాళ్లు సూడు తేల్కెసొప్పున లేసొచ్చిరు. ఐనా.. తల్లితీరు పిల్ల.. ఇల్లు తీరు ఆకిలుంటది. మీ అయ్య తేల్కెగల్లోడైతే మీరూ ఐతుండెలే’ అనుకుంట సుప్రభాతం సదువుతుంటే నా శెవులల్ల పడి ‘పండుగపూట ఎందుకొచ్చిన లొల్లిరా’ అని లేశిన. ఊసుగండ్లు తూడ్సుకుంట సయమాన్ల ఉన్న అంబడిగంపను తీస్కొని బైటికొచ్చిన. ‘నీతోని ఇదే లొల్లి ఉంటది. ఎంత సేపు మొత్తుకోవాల్రా. లేప్తె లేవవుగానీ మీదికెల్లి ఇడ్శివెట్టి పోయిరు అని అలుగుతువ్. ఇంకో రెండు కూతలేసి పోతుంటిమి’ అని గుస్సా అయింరు. ఏదో చెప్పి తప్పించుకుందాం అని ‘అరే మంచి కలలో ఉంటిరా. మీరే డిస్టబ్‌చేసిరు’ అంటుండగా ‘నీకు భలే కలల్‌వడ్తయసూ’ అని టాపిక్‌ను సాగదీసే ప్రయత్నం చేసిరు. ఇట్లయితే కాదనుకొని ‘ఎటు మొకాన పోదాం’ అని నేనే డైవర్ట్‍చేసిన.
‘ఆంధ్రోన్‌తోట దిక్కువోదామా?’ అని ఒకడన్నడు. ‘ఏ.. అది ఊర్కి దగ్గర్ల ఉంటది. ఆడోళ్లొస్తరు. ఏడికినొయ్యినా సరేగానీ ఆడొళ్లు రానిదిక్కువోదాం’ అని అనుకున్నం. ‘మూడుగుండ్ల దిక్కు పోదామా’ అని ఒకడన్నడు. మంచిగనే ఉంటదిగానీ జామతోట్లకు దొంగలొచ్చిరని కుక్కలెంబడి పడ్తయ్’ అని వద్దనుకున్నం. ‘పెచ్చేన్‌కంచె’ దిక్కువోతె కుక్కలవాయి, ఊర్లోంబాయి, గంగంబాయి అన్నీ అర్సుకోవచ్చు కానీ బొందలగడ్డలుంటయి. ఇగ పెద్దకంచె మొకాన పోవుడే దిక్కు. సావుల్లల్ల నుంచి మొదలువెడితే పీన్గెలబాయి, కొనేనె దాక తిర్గుతున్నం. మంచి పువ్వు దొర్కుతుంది. దూరంకెల్లే.. ‘ఏ.. ఆ చెట్టు నాది. ఆ పువ్వనెవరూ ముట్టు కోవద్దూ’ అని పోటీలు పడుతున్నం.
పాటలు పాడుకుంటా, జోక్స్వేసుకుంటా తంగెడు పువ్వుతో పాటు అడివి చామంతి, జాజిపువ్వు, గునుగు పువ్వు, ఉప్పు పువ్వు కూడా జమజేసుకుంటున్నం. ఇంతలో ఎన్కకెల్లి ఏదో గుంపొచ్చినట్లు అనిపించింది. ఇంకా మబ్బు మబ్బే ఉందికాబట్టి మొఖాలు సరిగ్గా కన్పించలే. కానీ ఆడొల్ల మాటలినిపిస్తున్నయి. ‘అరే ఎవరో ఆడొళ్లొస్తున్నట్టున్నరా’ అన్నడు మా గుంపులో ఒకడు. ‘ఓ నీ అన్యాలం పాడుగానూ.. ఈడిగ్గూడా నొచ్చిండ్రారా’ అని ఇచ్చంత్రపోయినం. ‘సక్కగ సూడురా.. గింత దూరం ఎవరొస్తరు?’ అని చూద్దామని శేగ్గాడు కొంచెం ఎన్కకు పొయ్యిండు. పోయెటప్పుడు మంచిగనే ఉన్నడుగానీ.. వచ్చేటప్పుడు ఏదో భూకంపం నొచ్చినట్టు ఉర్కొచ్చిండు మనోడు. అరే ఏమైందిరా? అని అడిగితే.. అదీ అదీ అంటుండు. ఓర్నీ.. ఏమైందో చెప్పసూ అని గదుమాయిస్తే.. ‘అరే మన క్లాసు మన క్లాసు అని మొత్తుకోవట్టె. ఇగ వీనితోని కాదు అనీ మేమే ఎదురునొయ్యినం. సూస్తే ఓ పది మందిదాంక అమ్మాయిలు. ఇద్దరు ముగ్గురు మా క్లాస్మేట్లూ ఉన్నరు.
మమ్మల్ని చూడలేగా అనుకొని అంబడి గంపలు నెత్తిలవెట్టుకొని పెద్ద కంచెల మొకాన ఉర్కినం. కంచె అంతా తిరిగేసరికి లేటయ్యింది. దొరికిన పువ్వూ, పత్రి తెంపుకొని అంబట్యాల్లకు ఊళ్లె పడ్డం. పువ్వు పీటమీద పెట్టి దబ్బు దబ్బున తానంజేసి జొన్నరొట్టె మీద మిర్పకారం, అల్లమెల్లిగడ్డ మడ్తవెట్టుకొని తినుకుంటనే స్కూల్‌కు వోయిన. ఒకరి తర్వాత ఒకరు సోపతిగాళ్లంతా వచ్చిరు. అప్పటికే ప్రార్థన అయిపోయింది. ఎట్లొచ్చిరో ఏమోగానీ తంగెడు పువ్వుకొచ్చిన అమ్మాయిలు మాకంటే ముందే క్లాస్ల ఉన్నరు. ‘ఏంరా.. ప్రార్థనైపోయిందాక ఏం మాముల చేసిరా?’ అని సార్‌గద్దు గదుమాయించిండు. మేం తల్కాయ నేలకేసి నిలవడ్డం. ‘ఒక్కొక్కడు ముప్పై బింగీలైనా తీయిరి, లేకపోతే యేడికొయిరో చెప్పురి?’ అని సార్‌ఆర్డరేశిండు. బింగీలే బెటరని తీస్తందుకు ప్రిపేరై ఉండంగనే ‘బత్కమ్మ పువ్వుకు పొయిరు సార్’ అని ఆ పిల్లలు పుసుక్కున అనేశిరు. సార్‌తో సహా క్లాస్ల ఉ్నళ్లంతా కెక్కెర కెక్కెర నవ్విరు. ‘ఇంతమందిల ఇజ్జత్‌తీశిరుగారా’ అని తిట్టుకున్నం.
మధ్యాహ్నం రొండున్నర అయ్యింది. అటెండర్ ఎంకటమ్మ సెకండ్‌బెల్ కొట్టింది. మామూలుగా అయితే నాలుగ్గంటలకు కొట్టాలె. ఇంతలోనే సారొచ్చి.. ‘అందరూ ఇంటికివోరి’ అని చెప్పిండు. ఇగ ఎగురుకుంట దుంకుకుంట మురిపెంతో ఇంటికి పోతున్నం. మధ్యన వదినె వరుసయ్యే ఒకామె కలిసింది. ‘ఓ పిలగా.. మీ అమ్మలు కర్నగూడెం కూలికినొయిరు. గుత్తవెట్టుకురంట. ‘మాకు లేటైతుండొచ్చు. జర మీ మర్దికి బత్కమ్మ పేర్శియ్యి’ అని నాకు చెప్పిరు. అన్నీ తయారువెట్టు.. పొద్దుమూ కంగ నొచ్చి పేర్చిస్తా’ అని చెప్పింది. అందరూ బత్కమ్మల కాడ ఆడుకుంటుంటే నేనేమో బత్కమ్మ ఎత్కపోవాల్నా.. అనిపించింది. కానీ తప్పదుగా. మా అక్కలకు అప్పటికే పెండ్లిళ్లయినయి. వస్తేగిస్తే సద్దులనాడు వస్తరు. కానీ ఎంగిలిపూలకు నేను బత్కమ్మ తీస్కపోవాలె. మా అమ్మలేమో కూలి చేస్తెనే ఇంట్లకెల్లేది. పండుగ పబ్బం గూడా కానకుంటా పోతుండె. పొద్దుమూకింది.
ఆ వదినొచ్చి బత్కమ్మ పేర్సిచ్చింది. అందరు తీస్కపోయినంక మెల్లగ తీస్కపోదామనుకున్నా. ఒకట్రెండు సార్లు గడి కాడికి పొయ్యి సూసొచ్చినా. పట్వారొల్ల బత్కమ్మొచ్చింది. దాశెను పూలొల్లదీ వచ్చింది. వెంకట్రెడ్డి సారొల్లది, అయ్యగారొల్లది రాంగనే బత్కమ్మ ఊపందుకుంట ది. ఎత్కరాను కావలొల్లు పోయిరంట. ఎంతలేదన్నా ఇంకో గంట పడ్తది. ఇంకా టైముందిగా అని మల్లొకసారి ఇంటి మొకాన నొచ్చిన. మెల్లగా చినుకులు షురు వైనయి. ఈ వానల తీస్కపోతే ఎవరికీ కన్పించంగా అనిపించి, జోరసంచి కొప్పెర వెట్టుకున్నా. ఒక చేతిల బతుకమ్మ, ఇంకోచేతిల పలారం గిన్నె పట్టుకొని మెల్లగా బత్కమ్మల కాడికిపొయ్యి పెట్టిన. కేశమోని అంజయ్య రాగందీసి ‘ఇద్దరక్కల్జెల్లెండ్లు ఉయ్యాలో ఒక్కూరికిచ్చిరీ ఉయ్యాలో.. ఒక్కడే మాయన్న ఉయ్యాలో నొచ్చెన్నపోడా యె ఉయ్యాలో’ అని పాడుతుండు. మొగాయిన బత్కమ్మ పాటలెందుకు పాడ్తడో అర్థంగాకపోయేది. కేశమోని అంజయ్యకు పోటీగా బాత్క పెంటమ్మ, ఆనమోని కమలమ్మ బతుకమ్మ పాటలు పాడుతుంటే ఊరంతా మార్మోగిపోతున్నది. ఆ పరవశంల పడి బత్కమ్మను ఎత్తుకోవాలె అనే బాధయితే తప్పింది.
ఇట్లా ప్రతీసారి.. ప్రతీ బతుకమ్మకు జరిగే కథనే. మా అన్న పెండ్లయినంక బత్కమ్మను ఎత్తుకపోవాలనే బాధ తప్పింది. బత్కమ్మనైతే తీస్కపోవుడు తప్పిందిగానీ పువ్వు, పత్రిరి పోవుడు మాత్రం మన బాధ్యతేగా. పెద్దగైనం.. ఎవరి పనులల్ల వాళ్లం బిజీ అయిపోయినం. చిన్నప్పుడు బత్కమ్మ పువ్వుకు పోవాల్నంటే ‘నేను పోతా నేను పోతా’ అని సంకలు గుద్దుకొని పోయేటోళ్లం. రాన్రానూ ‘ఎంగిలిపూల నాడు నువ్వుపో.. సద్దులకు నేను పోతా’ అనే నొంతులు పెట్టుకునేదాక వచ్చింది. ఇన్నేండ్ల నుంచి సూస్తున్నగనీ మా అమ్మలు బత్కమ్మ పండుగ నాడు ఇంటిపట్టున ఉన్నది లేదు.. ఓ పండుగ సంబురం అనుభవించింది లేదు. ‘పండుగనాడైనా ఇంటికాడ ఉండొచ్చుగా’ అని ఎన్నిసార్ల అడిగినా ‘మాకేం పండుగల్రా.. మీరు సల్లగుండుడే మాకు పెద్ద పండుగ’ అని తప్పించుకుందురు. వాళ్లను చూస్తే అసలైన బత్కమ్మలు వీళ్లు కదా అనిపించేది. మా అమ్మలిద్దరూ సొంతం అక్కాచెల్లెండ్లు. ‘ఇద్దరక్క చెల్లెండ్లూ ఉయ్యాలో ఒక్కింటికిచ్చిరీ ఉయ్యాలో’ అన్నట్లు. అక్క కోసం చెల్లె, చెల్లె కోసం అక్క ఒకరికొకరు పోటీ పడి త్యాగాలు చేసిండ్రు.
నాకూ పెండ్లయింది. ఆయల్ల సద్దుల బతుకమ్మ. ఎంగిలిపూల నాడు నేను పువ్వు తెంపుకొచ్చిన కాబట్టి సద్దుల నాడు మా అన్న పోతడేమో అనుకొని నేను నిమ్మళంగా పండుకున్న. ‘ఆరీ.. పువ్వు తీస్కొద్దురు లేండ్రిరా’ అని అమ్మ ఐదారుసార్ల పిలిచింది. నేను వెళ్తనేమో అనుకొని మా అన్న.. ఆయిన్నే పోతడేమో అనుకొని నేను ఎవ్వరమూ సప్పుడు చేయలేదు. సంచి తీస్కుంది. కాళ్లకు చెప్పులేస్కుంది. ‘అంబట్యాల్లదాంక పంతే బువ్వెట్లొస్తదో ఏమో.. మంది అందరూ పోతలేరా’ అని అనుకుంట అమ్మ మల్లన్న గుడి మొకాన పోతుంది. ఇంకా కాళ్ల కడియాల సప్పుడు వస్తూనే ఉంది. ఇంతమందిమి ఉండి అమ్మను పంపిస్తమా అనుకొని ఉర్కి అమ్మ చేతిలకెల్లి సంచి గుంజుకున్నా. ‘నీకెందుకు ఈ బాధ’ అని కోప్పడి అమ్మను ఇంటికి పంపించి లింగమయ్య గుండ్ల మొకాన పోయిన.
భూములన్నీ రియలెస్టేట్‌వెంచర్లు అయిపోయినయి. తంగెడు చెట్లు మునుపటి లెక్క లేవు. ఉన్న ఆ రెండు చెట్లకు పది మంది ఎగబడ్తరు. పువ్వు దొర్కకకపోతే పండుగ పడగొడ్తమా అనేది అమ్మ బాధ. మా బతుకుల్లో వెలుగులు నింపేందుకు బతుకమ్మ లెక్క జీవితాన్ని త్యాగం చేసిన మా ఇద్దరమ్మలూ ఇప్పుడు లేరు. పోయినయేడు ఎంగిలపూల బతుకమ్మ ముచ్చట. అమ్మలు లేరుగా.. నిద్రలేపేటోళ్లు ఎవరూ లేరు. నేనువోతా అనుకొని మా అన్న, అయిన్నే పోతడనుకొని నేను ఇద్దరమూ పోలేదు. టైం ఎనిమిది అయ్యింది. తంగెడు పువ్వింకా మా ఇంటికి చేరలేదు. మా అమ్మలు గుర్తుకొచ్చిరు. ‘పండగ పడగొడ్తమా’ అని వాళ్లు ఎంతో తిప్పలవడి, బతుకమ్మను ఎత్తుకునేటోళ్లు లేక పోయినా ఎట్లో అట్లచేసి బతుకమ్మ పేరుస్తుండె. మనసు బాధైంది. అప్పటికప్పుడు ఏడనో ఓ కాడ శాస్త్రానికి కొంత తంగెడు పువ్వు తెచ్చినం.
సద్దుల నాడు. పొద్దున ఐదు అయ్యింది. నన్నెవరూ లేపలేదు. లేపనీకె మా అమ్మలూ లేరాయె. సంచి పట్టుకొని రియల్‌ఎస్టేట్‌వెంచర్ల కంచెను దాటుకుంటా తంగెడు పువ్వు కోసం పయనమైన. ఇంటికొచ్చే సరికి ఎనిమిది అయ్యింది. చూస్తే పెద్ద పీటెమీద తట్టెడు తంగెడు పువ్వుంది. ఇదెక్కడిదీ అనుకున్నా. సేమ్‌నా పరిస్థితే మా అన్నది. లేపేవాళ్లెవరూ లేరు. ఆయిన్నే లేసిండు. పువ్వును బతికించడం కోసం.. మా బతుకమ్మను కాపాడటం కోసం నా లెక్క పొద్దున్నే వెళ్లినట్టుండు. ఇగ బతుకమ్మ బతికినట్లయ్యింది. మా ఇంటి బతుకమ్మలు నేర్పిన ఈ పువ్వుల సంప్రదాయాన్ని తర్వాత బాధ్యతగా తీసుకునేది మా పిల్లలే!