దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఓడిపోవాలనే కసితోనే ప్రజలు బీజేపీకి ఓటేశారని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. సానుభూతితో రఘునందన్ రావు గెలిచారు తప్ప బీజేపీ కాదని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, కేవలం కుటుంబ పాలన కొనసాగుతుండడంతో విసిగి వేసారిన ప్రజలు బీజేపీని గెలిపించారన్నారు. మీరనొచ్చు అదే ఓట్లు కాంగ్రెస్ కు వేయొచ్చు కదా అని. కానీ, కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మళ్లీ టీఆర్‌ఎస్ పార్టీలోకే వెళ్తారని బీజేపీ అసత్య ప్రచారాలు చేసిందన్నారు. ఇది కూడా రఘునందన్ గెలుపుకు ఓ కారణమని పొన్నం పేర్కొన్నారు. ఇప్పటికే టీ కాంగ్రెస్‌లో కొద్ది మంది నాయకులు తప్ప.. ఆ పార్టీ నుంచి గెలిచిన అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు ఆశించి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అందుకే దుబ్బాక ప్రజలు కాంగ్రెస్‌ను అస్సలు పట్టించుకోలేదని పొన్నం విశ్లేషించారు.