హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతినిచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్ లేని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కొత్తగా వేసిన లే అవుట్‌లకు మాత్రం ఎల్ఆర్ఎస్ తప్పనిసరి అని పేర్కొన్నారు. కొత్త ప్లాట్లకు మాత్రం సంబంధిత సంస్థల అప్రూవల్ పొందిన తర్వాతే రిజిస్ట్రేషన్ జరగనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలిగాయి. మంగళవారం ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని భావించిన సర్కార్.. మూడు నెలల క్రితం ఇందుకోసం ధరణి వెబ్‌సైట్‌తో పాటు ఎల్ఆర్ఎస్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రతి ఫ్లాట్‌కు ఎల్ఆర్ఎస్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొన్ని నెలల ప్రతిష్టంభన తరువాత తిరిగి పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేపట్టాలని కొద్దిరోజుల క్రితం నిర్ణయించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు విధానాన్ని సైతం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.