నగర ప్రజలకు టీఆర్‌ఎస్ పార్టీ వరాల జల్లు కురిపించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ కార్యక్రమం తెలంగాణ భవన్‌లో లాంఛనంగా జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక్కో కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల వరకూ ఉచిత నీరు అందిస్తామన్నారు. జలమండలిపై పడే 300-400 కోట్ల భారం.. మేమే భరిస్తామని సీఎం తెలిపారు. రాష్ట్రమంతా 24 గంటల మంచినీరు అందించడం నా కల. ప్రైవేటు పాఠశాలలకు కూడా ఉచితంగానే నీటి సరఫరా చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు, ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్తు అందిస్తామని సీఎం తెలిపారు. లాక్‌డౌన్ కాలంలో రవాణా వాహనాలపై ఉన్న పన్నులు రద్దు చేస్తాం. వ్యాపార సంస్థలకు 6 నెలల విద్యుత్తు కనీస చార్జీ కూడా మాఫీ చేస్తాం. కరోనా కాలంలో సినిమా థియేటర్లకు కరెంటు బిల్లులూ మాఫీ చేస్తామన్నారు. థియేటర్లలో ఇక మరిన్ని షోలు వేసుకోవడానికి అనుమతిస్తాం. సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడంపైనా వెసులుబాటు కల్పిస్తామని సీఎం వెల్లడించారు. బడ్జెట్ సినిమాల నిర్మాతలకు రాష్ట్ర జీఎస్టీ రద్దు చేస్తామని సీఎం తెలిపారు.
అకాల వర్షాలకు సర్వం కోల్పోయిన వారికి ఎన్నికల తర్వాత వరద సాయం పంపిణీ కంటిన్యూ చేస్తామన్నారు. కర్ఫ్యూల నగరం కావాలా? ప్రశాంత నగరం కావాలా? మీరో తేల్చుకోండని సీఎం ప్రజలనుద్ధేశించి మాట్లాడారు. హైదరాబాద్ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. అన్ని విషయాలు గమనించి ఓటేయాలని ఓటర్లకు విన్నవించారు. తమాషాగా ఓటేస్తే అది మనల్నే కాటేస్తుందని సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర సర్కారు సహకారం కావాలి. అందుకు తప్పకుండా టీఆర్‌ఎస్ గ్రేటర్‌లో గెలవాల్సిన అవసరముంది. కనుక ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ ప్రజలనుద్ధేశించి మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. నగర ప్రజలు జాగ్రత్త పడాలి. అది తీవ్రమైతే లాక్‌డౌనే ప్రత్యామ్నయమాన్నారు సీఎం. త్వరలో దేశానికి కొత్త దశ, దిశ చూపిస్తానన్న కేసీఆర్.. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఓటేయాలని మీడియా ముఖంగా మాట్లాడారు.
లౌకిక నగరాన్ని మనమంతా కాపాడుకోవాలి. అలవోకగా, ఆషామాషీగా ఓటేస్తే.. మన వేలుతో మన కన్నే పొడుచుకున్నట్లు అవుతుంది. హైదరాబాద్‌లో మత కల్లోలాలు చెలరేగితే.. పిచ్చి పిచ్చి ఘటనలు జరిగితే రియల్ ఎస్టేట్ 100 శాతం కుదేలవుతుంది. భూముల ధరలు పూర్తిగా పడిపోతాయి. హైదరాబాద్ మార్కెట్టే కుప్పకూలిపోతుంది. విపక్షాల మాటలు నమ్మకూడదని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా రెడ్డి, తలసాని శ్రీనివాస్, కొప్పుల హరీష్, మహమూద్ అలీ, ఎంపీ కేశవరావు తదితరులున్నారు.