- సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఆరుగాలం శ్రమ పడి పంట పండించిన రైతన్నకు మేలు జరిగేలా గిట్టుబాటు ధర కల్పించి, వారి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన ప్రగతిభవన్‌లో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతు క్షేమమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అన్నారు. వారు బాగుంటేనే దేశమైనా, రాష్ట్రమైనా బాగుంటదని తెలిపారు. వారు పండించిన పంటను దళారులకు చేరకుండా, గిట్టుబాటు ధర కలిపించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. సాగు విధానం పట్ల రైతులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాల్సి ఉందని సీఎం వెల్లడించారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల ప్రభావం రైతులకు ఏ మేర ప్రభావం చూపుతుందని చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.