- 40 కుటుంబాలు వేరే ప్రాంతానికి వలస
దెయ్యం… అనగానే ఎవరికీ భయం ఉండదూ. అందరికీ భయమే రాత్రిళ్లు బయటకు రావాలంటే హడల్. అయితే తాజాగా తమ కాలనీలో దెయ్యం తిరుగుతుందటూ ఏకంగా బుడగజంగాలకు చెందిన 40 కుటుంబాల వరకు ఇళ్లు ఖాళీ చేసి వెల్లిపోయారు. దీంతో ఆ కాలనీ ఇంకా పూర్తిగా నిర్మానుష్యంగా మారడమేగాకుండా ఇండ్లన్నీ పాడుబడ్డాయి. ఈ ఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలం పోతారం గ్రామంలో చోటుచేసుకుంది. కాలనీ వాసులు కథనం ప్రకారం పదేళ్లుగా ఓ భవనంలో ఎవరూ నివసించడంలేదు. దీంతో ఆ భవనం నిరుపయోగంగా మారింది. చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి భవనం గోడలపై నుండి తీగలు పారాయి. పూర్తిగా భయకరంగా మారిపోయింది. అయితే ఈ భవనంలో రాత్రిపూట ఓ మహిళ నగ్నంగా బోనం ఎత్తుకొని తిరుగుతుందని కాలనీవాసులు చెబుతున్నారు.
ఇదిలావుండగా గత అక్టోబర్ నెలలో వారం రోజుల్లోనే బుడగ జంగాలకు చెందిన అన్మదమ్ములు చింతల బాలరాజు, చింతల భాను మరణించారని, అలాగే గంధం రాజు అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలిపారు. చేతబడి చేయడం వలనే వీరు మరణించారని కాలనీవాసులు నమ్ముతున్నారు. ముఖ్యంగా యువకులు మాత్రమే అనారోగ్యంతో చనిపోతున్నారని కాలనీకి చెందిన గంధం శేఖర్ వాపోయారు. దీంతో భయం వేసి కాలనీవాసులు ఇండ్లను ఖాళీ చేసి మండల కేంద్రమైన తరిగొప్పుల శివారులో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని శేఖర్ వివరించారు.