ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టు సిరీస్ సందర్భంగా భారత ఆటగాళ్లు మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలపై ఆసీస్ ఫ్యాన్స్ తమ వెకిలి చేష్టలు, వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసి వారిని అవమాన పరిచిన విషయం తెలిసిందే. కాగా, ఆసీస్ పర్యటన అనంతరం ఇండియాకు తిరిగొచ్చిన సిరాజ్.. మీడియాతో మాట్లాడాడు.ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో చేదు అనుభవం ఎదురైంది. దీంతో పెద్ద దుమారమే రేగింది. తమపై ప్రేక్షకులు వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేడంతో అంపైర్లకు ఫిర్యాదు చేశామని, అయితే అంపైర్లు అనూహ్యంగా మ్యాచ్ నుంచి వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోమని సలహా ఇచ్చారని సిరాజ్చె ప్పాడు. కానీ తమ కెప్టెన్ రహానే అందుకు అంగీకరించలేదని, అలాగే మ్యాచ్ కొనసాగించామని వివరించాడు.
‘అంపైర్లు మ్యాచ్ నుంచి వెళ్లిపోవాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని చెప్పారు. కానీ కెప్టెన్ రహానే భాయ్ అందుకు ఒప్పుకోలేదు. తాము ఆటను ఎంతో గౌరవిస్తామని, అందువల్ల అలా వెళ్లిపోవడం తమకిష్టం లేదని అన్నాడు. అది చాలా గొప్ప విషయం’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తనపై ప్రేక్షకులు చేసిన వ్యాఖ్యలు తనను మానసికంగా మరింత దృఢంగా మార్చాయని సిరాజ్ పేర్కొన్నాడు.