న్యూఢిల్లీ: ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ భారత్‌లో లేదని కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ.. వ్యాధి తీవ్రతలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది. మంగళవారం నాడు జరిగిన పత్రికా సమావేశంలో నీతీ అయోగ్ సభ్యుడు డా. వీకే పాల్ ఈ ప్రకటన చేశారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌కు కూడా వీకే పాల్ నేతృత్వం వహిస్తున్నారు. కొత్త కరోనాలోని జన్యుమార్పులు గురించి ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజాగా మార్పుల వల్ల వ్యాధి వేగంగా వ్యాపిస్తోందని, అయితే.. వ్యాధి తీవ్రతలో ఎటువంటి మార్పూ లేదని ఆయన స్పష్టం చేశారు. కొత్త కరోనా కారణంగా మరణించే అవకాశం పెరగలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రెటరీ రాజేష్ భూషన్ తెలిపారు. అయితే..ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకూ తాము వెయ్యికి పైగా కేసుల్లో కరోనా శాంపిళ్లను పరీక్షించినా గానీ.. కొత్త కరోనా ఆనవాళ్లు కనిపించలేదని ఆయన తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్రం ఇప్పటికే అనేక బ్రిటన్‌కు విమాన సర్వీసులను డిసెంబర్ 31 వరకూ నిలిపివేసిన విషయం తెలిసిందే.