దుబ్బాక ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ పార్టీని పటాపంచలు చేసి, బీజేపీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక్కడ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతపై, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్పష్టమైన ఆధిక్యంతో అసెంబ్లీ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు ఓట్లతో మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఇరు పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. మొదటి అర్ధభాగంలో బేజీపీ ఆధిక్యంలో నిలవగా.. అనంతరం 20 రౌండ్ల వరకు టీఆర్‌ఎస్ లీడ్ సాధించింది. కానీ, కీలకమైన సమయంలో మళ్లీ బీజేపీ పుంజుకొని 1470 ఓట్లతో విజయం సాధించింది.
కాగా, ఈ విజయంపై ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ రావు స్పందించారు. ఈ విజయం ఘనత ఎట్టి పరిస్థితుల్లోనూ దుబ్బాక ప్రజలకే చెందుతుంది అని అన్నారు. బీజేపీ గెలుపుకు కారణమైన దుబ్బాక ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందనీ.. ప్రచారంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.