భారత ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలన్నింటికి సమాధానాలను సమర్పించామని టిక్‌టాక్ యాప్ ఇండియా అధిపతి నిఖిల్ గాంధీ తెలిపారు. అలాగే కేంద్రం వ్యక్తం చేస్తున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు అధికారులతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు గాంధీ తన బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపారు. జాతీయ భద్రత, గోప్యతా సమస్యల దృష్ట్యా గతనెలలో టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. నిషేధం నాటికి మనదేశంలో సుమారు 200 మిలియన్ మంది టిక్‌టాక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు గూగుల్ ప్లే స్టోర్ గణాంకాలు చెబుతున్నాయి.
డేటా గోప్యత, భద్రతలతో సహా యాప్‌కు సంబంధించిన ప్రతి అంశం భారత చట్టాలకు లోబడే ఉన్నాయని గాంధీ మరోసారి తెలిపారు. భారత్‌లో టిక్‌టాక్ యాప్ వినియోగదారుల సమాచారాన్ని ఏ దేశ ప్రభుత్వంతోనూ పంచుకోలేదని, భారత సమగ్రతన దెబ్బతీసే ఎలాంటి ఫ్యూచర్‌ను యాప్‌లో వాడలేదన్నారు.‘‘టిక్‌టాక్ యాప్ వేదిక ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అనేకమంది ఆర్టిస్టులు, కథకులు, అధ్యాపకులు, ప్రదర్శకులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సొంతంగా జీవనోపాధిని కల్పించుకోవడంతో పాటు అనేకమంది జీవన నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు తన కృషిచేశారు. భారత్‌లోని కస్టమర్లకు టిక్‌టాక్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు తమవంతు ప్రయత్నం చేస్తాం’’ అని నిఖిల్ గాంధీ తెలిపారు.