end
=
Sunday, January 19, 2025
క్రీడలునేడే ఐపీఎల్‌ తుది సమరం
- Advertisment -

నేడే ఐపీఎల్‌ తుది సమరం

- Advertisment -
- Advertisment -
  • ఫైనల్ పోరుకు సిద్దమైన ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్

2020లో అసలు ఐపీఎల్‌ జరుగుతుందా.. అనే సందేహాలను పటాపంచలు చేసి, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వేదికగా 52 రోజుల పాటు అభిమానులను అలరించిన టోర్నీ ఇప్పుడు చివరి ఘట్టానికి చేరింది. టోర్నీ ఆసాంతం అద్భుత వినోదం పంచిన లీగ్‌లో ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ ఒకవైపు… పదమూడో ప్రయత్నంలో ఫైనల్‌ చేరి మొదటి ఐపీఎల్‌ టైటిల్‌ వేటలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ పోరుకు ‘సై’ అంటున్నాయి. మైదానంలో ప్రేక్షకులు లేకపోయినా… టీవీ వీక్షకుల ఆనందానికి ఏమాత్రం లోటు రాకుండా సాగిన ఈ సీజన్‌ ఐపీఎల్‌కు మరో అద్భుత ముగింపు లభించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

నాలుగు సార్లు (2013, 2015, 2017, 2019) చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ మళ్లీ గెలిస్తే వారి ఖాతాలో ఐదో టైటిల్‌ చేరుతుంది. ఇప్పటికే లీగ్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తూ అత్యంత విజయవంతమైన టీమ్‌గా నిలిచిన రోహిత్‌ సేన ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. ‘డేర్‌డెవిల్స్‌’గా విఫలమైన ఢిల్లీ… ‘క్యాపిటల్స్‌’గా మారి గత ఏడాది మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు మరింత మెరుగైన ప్రదర్శనతో తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఐపీఎల్‌ నెగ్గని మూడు జట్లలో ఒకటైన ఢిల్లీ గెలిస్తే మొదటి ట్రోఫీ వారి చెంతకు చేరుతుంది. లీగ్‌లో టాప్‌–2లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ ఎంత హోరాహోరీగా సాగుతుందనేది ఆసక్తికరం.


ముంబై ఇండియన్స్‌ జట్టు టోర్నీలో ప్రస్థానం: లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లలో 9 గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్‌లో అతి సునాయాసంగా ఢిల్లీని 57 పరుగులతో చిత్తు చేసి ఎలాంటి తడబాటు లేకుండా దర్జాగా ఫైనల్‌కు చేరింది. టోర్నీ ఆసాంతం ప్రత్యర్థి జట్లపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన చివరి మ్యాచ్‌ ను మినహాయిస్తే తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు అత్యల్ప స్కోరు కూడా 162 పరుగులు ఉందంటే జట్టు బ్యాటింగ్‌ బలమేమిటో అర్థమవుతోంది. లక్ష్యాన్ని నిర్దేశించినా… లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినా సానుకూల ఫలితాలు పొందగలిగింది.

ఆటగాళ్ల ప్రదర్శన: డిఫెండింగ్‌ చాంపియన్‌ మళ్లీ ఫైనల్‌ చేరేందుకు జట్టులో ప్రతీ ఒక్కరు తమదైన పాత్ర పోషించారు. ఇంకా చెప్పాలంటే ఒకరితో మరొకరు పోటీ పడి బాగా ఆడేందుకు ప్రయత్నించారు. ఇషాన్‌ కిషన్‌ (483 పరుగులు), డికాక్‌ (483), సూర్యకుమార్‌ యాదవ్‌ (461)ల బ్యాటింగ్‌ ప్రధానంగా జట్టును నడిపించింది. ఇక పొలార్డ్‌ (190.44), హార్దిక్‌ పాండ్యా (182.89)ల స్ట్రయిక్‌రేట్‌ చూస్తే ఎలాంటి ప్రత్యర్థి అయినా ఆందోళన చెందాల్సిందే. రోహిత్‌ శర్మ స్థాయి ఆటగాడు విఫలమైనా… ముంబైకు ఆ లోటు ఏమాత్రం కనిపించలేదు. ప్రతీ మ్యాచ్‌లో కనీసం ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ చెలరేగి ప్రత్యర్థులను దెబ్బ కొట్టారు. ఇక బౌలింగ్‌లో బుమ్రా (27 వికెట్లు), బౌల్ట్‌ (22) ప్రదర్శన ముంబైని ముందంజలో నిలిపింది. వీరిద్దరి ఎనిమిది ఓవర్లే మ్యాచ్‌లను శాసించాయంటే అతిశయోక్తి కాదు. ఈ బృందాన్ని నిలువరించాలంటే ఢిల్లీ రెట్టింపు ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది.


ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు టోర్నీలో ప్రస్థానం: లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లలో 8 గెలిచి రెండో స్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్‌లో చిత్తుగా ఓడినా… రెండో క్వాలిఫయర్‌లో సమష్టి ప్రదర్శనతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గెలిచి ఫైనల్‌ చేరింది. లీగ్‌ ఆరంభంలో అద్భుతంగా ఆడినా రాన్రానూ ఆట దిగజారుతూ వచ్చింది. నాలుగు వరుస ఓటముల తర్వాత ఎట్టకేలకు ఒక విజయంలో ప్లే ఆఫ్స్‌ చేరగా… ముంబై చేతిలో భారీ ఓటమి జట్టు బలహీనతను చూపించింది. అయితే గత మ్యాచ్‌లో తుది జట్టులో సరైన మార్పులు, సరైన వ్యూహాలతో విజయాన్ని అందుకుంది. అయితే ఐదు మ్యాచ్‌లలో 150 లోపే పరుగులు చేయగలిగింది.

ఆటగాళ్ల ప్రదర్శన: 16 మ్యాచ్‌లలో 4 సార్లు డకౌట్‌ అయి కూడా మొత్తంగా 603 పరుగులు (2 సెంచరీలు) చేయగలిగిన శిఖర్‌ ధావన్‌ ఇప్పుడు జట్టుకు అత్యంత విలువైన ఆటగాడు. 145.65 స్ట్రయిక్‌రేట్‌తో అతను ఈ పరుగులు చేయడం ఓపెనర్‌గా ధావన్‌ ఇచ్చే ఆరంభంపై ఢిల్లీ ఎంతగా ఆధారపడుతుందో చెప్పవచ్చు. అయితే అతనికి ఇతర బ్యాట్స్‌మెన్‌ నుంచి సహకారం లభించలేదు. అదే బ్యాటింగ్‌ వైఫల్యం ఢిల్లీని లీగ్‌ చివరి దశలో దెబ్బ తీసింది. శ్రేయస్‌ అయ్యర్‌ 454 పరుగులతో రెండో స్థానంలో ఉన్నా.. అతని స్ట్రయిక్‌రేట్‌ (122.37) పేలవం. ఎలిమినేటర్లో ఆడిన ఇన్నింగ్స్‌లా (20 బంతుల్లో 21) మళ్లీ అయ్యర్‌ ఆడితే అది ఆత్మహత్యా సదృశ్యమే. టోర్నీలో స్టొయినిస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన (352 పరుగులు, 12 వికెట్లు) జట్టును బలంగా మార్చింది. ఫైనల్లోనూ అతను ఇదే జోరు కనబర్చాల్సి ఉంది. హెట్‌మైర్‌ కూడా కీలకం. రబడ (29 వికెట్లు), నోర్జే (20)తో పేస్‌ పదునుగా కనిపిస్తుండగా…అశ్విన్, అక్షర్‌ పటేల్‌ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలరు.

టైటిల్‌ విజేతకు రూ. 10 కోట్లు
ఈసారి ఐపీఎల్‌లో ప్రైజ్‌మనీని భారీగా తగ్గించారు. చాంపియన్‌గా నిలిచిన జట్టుకు రూ. 10 కోట్లు ఇవ్వనున్నారు. గత ఏడాది విజేత జట్టుకు రూ. 20 కోట్లు లభించాయి. ఈసారి రన్నరప్‌ జట్టుకు రూ. 6 కోట్ల 25 లక్షలు దక్కుతాయి. గత ఏడాది రన్నరప్‌ జట్టు ఖాతాలో రూ. 12 కోట్ల 50 లక్షలు చేరాయి. ఈసారి ప్లే ఆఫ్‌ దశలో ఓడిన రెండు జట్లకు రూ. 4 కోట్ల 37 లక్షల 50 వేల చొప్పున ప్రైజ్‌మనీ కేటాయించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -