end

ట్రంప్‌ ఆశలు ఆవిరి.. అగ్రరాజ్యాధినేతగా బైడెన్

మరోసారి అమెరికా అగ్రపీఠాన్ని అధిరోహించాలనకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ఆశలు ఆవిరయ్యాయి. ఆయన ప్రత్యర్థి, డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ భారీ మెజార్టీతో ట్రంప్‌ను చిత్తుగా ఓడించారు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరో తేలిపోయింది. తాను పుట్టిన గడ్డ పెన్సిల్వేనియాలో జెండా ఎగరేసిన బైడెన్‌.. అగ్ర రాజ్యానికి 46వ అధ్యక్షుడిగా తన స్థానాన్ని ఖరారు చేసుకున్నారు. హోరాహోరీ, ఉత్కంఠభరిత పోరులో డొనాల్డ్‌ ట్రంప్‌పై పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించారు. వరుసగా రెండోసారి విజయం సాధించని నాలుగో అధ్యక్షుడిగా ట్రంప్‌ చరిత్రలో నిలిచిపోయారు. వచ్చే ఏడాది జనవరి 20న బైడెన్‌ పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. భారతదేశ మూలాలున్న కమలా హారిస్‌ దేశ ఉపాధ్యక్షురాలు కానున్నారు. విశేషమేమంటే, 77 ఏళ్ల వయసులో ఈ పదవిని చేపట్టబోతున్న అతి పెద్ద వయస్కుడు బైడెన్‌ అయితే.. 56 ఏళ్ల వయసులో అతి పిన్నవయస్కురాలిగా కమలా హ్యారిస్‌ ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్నారు.

అమెరికా ఎన్నికల ఫలితాల్లో 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించిన బైడెన్‌ తొలి రోజు నుంచే విజయానికి ఒక్క అడుగు దూరంలో నిలిచిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా కౌంటింగ్‌ కొనసాగుతూ రావడంతో విజేత ఎవరనేది తేలలేదు. చివరికి, స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 11.30 గంటలకు పెన్సిల్వేనియాలో కౌంటింగ్‌ ముగిసింది. జో బైడెన్‌ 33,45,906 (49.7%) ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ ట్రంప్‌ 33,11,448 (49.2%) ఓట్లను మాత్రమే సాధించారు. దాంతో, డెమొక్రటిక్‌ పార్టీ విజయం సాధించినట్లు ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టాలంటే 270 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించాలి. పెన్సిల్వేనియాలో విజయం సాధించడం ద్వారా బైడెన్‌ 284 ఓట్లు సాధించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నెవాడాలోనూ డెమొక్రటిక్‌ పార్టీ విజయ ఢంకా మోగించింది. దాంతో, శనివారం తుది ఫలితాలు వెలువడే సమయానికి డెమొక్రటిక్‌ పార్టీ 290 ఎలక్టోరల్‌ సీట్లను సాధించినట్లు అయింది. డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ మాత్రం 214 ఎలక్టోరల్‌ ఓట్లకే పరిమితమైంది.

దాంతో, బైడెన్‌ విజయం సాధించినట్లు అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా మీడియా సంస్థలన్నీ ప్రకటించాయి. ఇప్పటి వరకూ ఓపిక పట్టిన బైడెన్‌ కూడా కొత్త అధ్యక్షుడిని తానేనని ప్రకటించుకున్నారు. ఒక్క ట్రంప్‌ మాత్రమే ఇంకా ఫలితాలను జీర్ణించుకోలేదు. ఇప్పటికీ విజేతను తానే అంటూ ఆయన బీరాలు పోతున్నారు. ఇక, నార్త్‌ కరోలినా, జార్జియా రాష్ట్రాల ఫలితాలు మాత్రమే వెలువడాల్సి ఉంది. వీటిలో, నార్త్‌ కరోలినాలో రిపబ్లికన్లు, జార్జియాలో డెమొక్రాట్లు ముందంజలో ఉన్నారు. కాగా, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన బైడెన్‌కు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేతలు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ద్వేషం పక్కన పెట్టి దేశాభివృద్ధికి కృషి చేద్దాం: బైడెన్‌
అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడికీ రాని మెజారిటీ తనకు వస్తోందని, 300 పైచిలుకు ఎలక్టోరల్‌ ఓట్లతో తాను అధ్యక్ష పదవిని చేపడతానని జో బైడెన్‌ ఇంతకుముందే ప్రకటించారు. విజయం సాధించిన తర్వాత ఆయన డెలావర్‌లోని వెల్మింగ్టన్‌ నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 40 లక్షల పైచిలుకు పాపులర్‌ ఓట్లతో ట్రంప్‌ను ఓడిస్తున్నాను. ట్రంప్‌ నాకు శత్రువేం కాదు. ఎన్నికల్లో ప్రత్యర్థి మాత్రమే. అందరం అమెరికన్లమే. దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే అందరి లక్ష్యం కావాలి. దూషణల్ని, ద్వేషాన్ని పక్కనపెట్టి అందరం ఒకటి కావాల్సిన సమయమిది. గాయాలను మాన్పాల్సిన సమయమిది. నా హయాంలో ఘర్షణలకు తావులేదు. అందరూ కలిసిరండి అని రాజకీయ నాయకులకు, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

తాను ముందే ప్రకటించినట్లు, కొవిడ్‌19 కార్యాచరణ ప్రణాళిక అమలును అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేసిన తొలిరోజే మొదలు పెడతానని హామీ ఇచ్చారు. ‘‘నాకు ఓటేసిన వారికీ ఓటెయ్యని వారికీ కూడా నేనే అధ్యక్షుణ్ణి. నన్ను ఎంపిక చేసుకున్నందుకు కృతజ్ఞుణ్ణి. మీ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానన్నారు. మన ముందు ఎన్నో సవాళ్లున్నాయి. కలిసికట్టుగా వాటిని ఎదుర్కొందాం’’ అని బైడన్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘‘దేశవ్యాప్తంగా అన్ని మతాలు, వర్గాలు, దేశాల వారు మా ప్రణాళికలకు ఆమోదముద్ర వేశారని ఈ సంఖ్యలు సూచిస్తున్నాయి. కొవిడ్‌, ఆర్థిక వ్యవహారాలు, వాతావరణ మార్పులు, జాత్యహంకార దాడుల అదుపు మొదలైన అంశాలపై మా ప్రణాళికలను ప్రజలు ఆమోదించారు. వీటిని చేపడతాం’’ అని బైడెన్‌ గర్వంగా చెప్పుకొచ్చారు.

Exit mobile version