కరోనా వ్యాక్సిన్ దేశంలో 2021 ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి రానుంది. ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సీరం సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌పై ఆ సంస్థ సీఈవో అదర్ పూనావాలా కీలక ప్రకటన చేశారు. ఆక్స్‌ఫర్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను తొలుత హెల్త్‌కేర్ వర్కర్లకు, వయసు పైబడిన వారి కోసం ఫిబ్రవరి 2021 నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని, సామాన్య ప్రజలకు ఏప్రిల్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ ధర రెండు డోసులకు గానూ దాదాపుగా రూ.1000 వరకూ ఉండొచ్చని పూనావాలా తెలిపారు.
ఇప్పటికే నాలుగు కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను సిద్ధం చేశామని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) తెలిపింది. నియంత్రణ సంస్థల నుంచి సరైన సమయంలో ఆమోదం లభిస్తే, 2021 జనవరి లోపు ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని సీఐఐ సీఈఓ అదర్ పూనావాలా పేర్కొన్నారు. కాగా, దేశంలో కొవిడ్-19 వ్యాక్సిన్ కొవిషీల్డ్ కోసం మూడో దశ పరీక్షలకు నమోదు ప్రక్రియను పూర్తిచేశామని సీఐఐ, ఐసీఎంఆర్ ప్రకటించాయి.