- రీసైక్లింగ్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం డివిజన్ పరిధిలోని ఐడిఏ జీడిమెట్ల ఫేస్ -4 లో జీహెచ్ఎంసీ, ప్రైవేట్ భాగస్వామి(రాంకీ) సంయుక్తంగా రూ.15 కోట్లతో ఏర్పాటు చేసిన సీ&డీ వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్‌ను ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి గ్రీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీగా తిరిగి వినియోగించుకునేలా దక్షిణ భారతదేశంలోనే అత్యాధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన సీ&డీ వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్ ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా కొత్త ప్రాజెక్టులను ప్రోత్సహిస్తుందని అన్నారు.
హైదరాబాద్ నగరంలో రోజురోజుకీ వేల మెట్రిక్ టన్నుల సీ&డీ వ్యర్థం వెలువడుతుందని, దీన్ని రీసైక్లింగ్ కు వినియోగించుకోవడంతో వేస్ట్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్.. ఇలా రెండు విభాగాలుగా పనులు జరగడం, ఆ తర్వాత రీసైక్లింగ్‌తో ఇటుకలు, పేవర్ బ్లాక్‌లు తయారు అయ్యే విధంగా ప్లాంట్ ను ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. వ్యర్థాలను క్రషింగ్ ద్వారా కంకర, కోర్, ఫైన్ ఇసుకగా తిరిగి మార్చేందుకు ఈ ప్లాంట్ ఉపయోగపడుతుందన్నారు. ఈ కంకరను రోడ్ల లెవెల్ ఫిల్లింగ్‌కు, ఇసుకను రోడ్డు పనుల్లో పీసీసీగా, ల్యాండ్ స్కేపింగ్ పనులకు వివిధ రకాలుగా వాడొచ్చని అన్నారు. బిల్డర్లు, ప్రజలు సీ&డీ వేస్ట్‌ను తరలించేందుకు జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్‌కు 180012007669 ఫోన్ చేస్తే వాహనాలు మీ ప్రాంతానికే వచ్చి సాధారణ రుసుముతో వ్యర్థాలను ప్లాంట్ కు తరలిస్తారని, కనుక ప్రజలు చైతన్యవంతులై ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి , హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ , ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రాహుల్ రాజ్ ఐఎఎస్, కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత, రాంకీ సంస్థ ఎండి & సీఈఓ గౌతం రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మసూద్ మాలిక్, డిప్యూటీ కమిషనర్ రవీందర్ కుమార్, స్థానిక కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.